
ఏటా నాగోబాకు వైభవంగా పూజలు
గంగాజలం కోసం నేటికీ కాలినడకన ప్రయాణం
కెస్లాపూర్ నుంచి హస్తలమడుగుకు.. తిరిగి ఆలయ ప్రాంగణానికి
జాతరపై ఎడ్లబండితోనే ప్రచారం
ఇంద్రవెల్లి, జనవరి 28: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే నాగోబా జాతరకు వేళయింది. మెస్రం వంశీయులు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరాధ్యదేవతను అభిషేకించేందుకు గంగాజలం కోసం వీరంతా నేటికీ వందల కిలోమీటర్లు కాలినడకనే వెళ్తారు. కెస్లాపూర్ నుంచి బయల్దేరి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు గోదావరి తీరం, తిరిగి జాతర ప్రాంగణం చేరేవరకు రోజుల తరబడి కాలినడకనే సాగుతారు. సంస్కృతీసంప్రదాయాలను మరువకుండా, ఆచారాలను భావితరాలకు అందించడంలో జిల్లా గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిలో మెస్రం వంశీయులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
గిరిజన వేడుక నాగోబా జాతర మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నది. ఈ జాతర నిర్వహణ పనుల్లో ఐటీడీఏ యంత్రాంగంతో పాటు మెస్రం వంశీయులు నెల ముందు నుంచే నిమగ్నమయ్యారు. కాగా, ఈనెల 31 న నిర్వహించే ప్రత్యేక పూజల కోసం గంగాజలం ఝరితో మెస్రం వంశీయులు ఇప్పటికే కెస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. అక్కడే మోత్కాకు చెట్టుపై ఝరిని భద్రపరిచారు. అయితే ఈ గంగాజలం కోసం వీరంతా వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అంటే బస్సుల్లోనో.. కార్లలోనో, ద్విచక్ర వాహనాల్లోనో కాదు. దూరమెంతైనా కాలినడకనే. లైన్ తప్పకుండా ఒకరి వెనుక ఒకరు.. ఒక క్రమశిక్షణ కలిగిన సైనిక బెటాలియన్లా కదులుతారు. ప్రస్తుత ఆధునిక యుగంలో దాదాపు అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీరు పాతతరం నేర్పించిన ఆచారాన్ని మరువలేదు. తమ సంస్కృతిని విడిచిపెట్టలేదు. తమ ఆరాధ్య దైవానికి మనసారా పూజలు చేసేందుకు వీరంతా ఎంతో నిష్టతో ఉంటారు. కెస్లాపూర్ నుంచి జన్నారం మండలంలోని గోదావరి హస్తలమడుగు తీరానికి కాలినడక వెళ్లి, తిరిగి నాగోబా ఆలయానికి అలాగే వస్తారు. వందలాది మంది మెస్రం వంశీయులు దాదాపు 125 గ్రామాల మీదుగా గంగాజలం సేకరణ కోసం పాదయాత్ర చేస్తారు. ఫుష్యమాసంలో కనిపించే నెలవంక దర్శనంతో మెస్రం వంశీయులు నాగోబాకు నిర్వహించే మహాపూజల ఏర్పాట్ల కోసం నిమగ్నమవుతారు. నాగోబా మహాపూజలతోపాటు గంగాజలం సేకరణపై ఎడ్లబండి(చక్డా)తో వారం రోజుల పాటు మెస్రం వంశీయులు ఉండే గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
గ్రామాల్లో ఎడ్లబండి(చక్డా)తో ప్రచారం….
ప్రచార ఎడ్లబండి(చక్డా)లో కఠోడ మెస్రం కోసురావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్ ప్రచారానికి బయలుదేరారు. కెస్లాపూర్ గ్రామం నుంచి ఈ నెల 5న ప్రారంభమైన ప్రచార ఎడ్లబండి(చక్డా) ముందుగా సిరికొండ మండలానికి చేరుకొని, నాగోబా దేవత మహాపూజలకు ఉపయోగించే మట్టికుండల తయారీ కోసం కుమ్మరికి ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత 11న సాయంత్రం కెస్లాపూర్కు చేరుకున్నారు. కెస్లాపూర్ గ్రామంలోని మెస్రం వంశీయుల పెద్దవాడైన మడావి ఇంటి వద్ద రాత్రి బసచేశారు. 12 న గ్రామంలోని పురాతన నాగోబా ఆలయం(మురాడి)లో ప్రత్యేక పూజలు చేసి పవిత్రమైన గంగాజలం సేకరించడానికి పాదయాత్రగా బయల్దేరారు.
గంగాజలం కోసం మెస్రం వంశీయుల పాదయాత్ర
కెస్లాపూర్ నుంచి ఈ నెల 12న సాయంత్రం గంగాజలం సేకరణ పాదయాత్ర మొదలుపెట్టారు. వివిధ గ్రామాల మీదుగా ఈ నెల 18న జన్నారం మండలంలోని గోదావరినదికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, గంగాజలం సేకరించారు. అనంతరం 21న సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని దోడంద గ్రామానికి చేరుకున్నారు. నాలుగు రోజుల బస అనంతరం 27న ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకొని ఇంద్రాదేవి ఆలయంలో చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం కెస్లాపూర్ మర్రిచెట్లకు వద్దకు చేరుకున్నారు. ఇక్కడే నాలుగు రోజులు బసచేస్తారు. ఈ నెల 31న నాగోబాకు గంగాజలంతో మహా పూజలు చేస్తారు.
పుష్యమాసంలోనే జాతర
పుష్యమాసంలోనే నాగోబాకు మహాపూజలు నిర్వహిస్తాం. నెలవంక దర్శనంతోనే నాగోబాకు నిర్వహించే మహాపూజలకు అన్ని ఏర్పాట్లు చేపడుతాం. ముందుగా ఎడ్లబండి (చక్డా)తో ప్రచారాన్ని ప్రారంభిస్తాం. ఇక హస్తలమడుగు నుంచి గంగా జలం సేకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం మర్రిచెట్ల వద్దకు చేరుకు న్నాం. గంగాజలాన్ని ఓ మోదుగ చెట్టుపై భద్ర పరిచాం. మర్రిచెట్ల నీడలో కుటుంబ సమేతంగా నాలుగు రోజులు బస చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి ఈ నెల 31న గోవాడ్కు చేరుకొని మహిళలకు ప్రవేశం కల్పిస్తాం. గోవాడ్ పరిసర ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేసి బసచేస్తాం. 31న అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించి, ఉత్సవాలు ప్రారంభిస్తాం.
-మెస్రం వెంకట్రావ్ పటేల్, మెస్రం వంశీయుల పీఠాధిపతి
సంప్రదాయాలతోనే గుర్తింపు..
మెస్రం వంశీయులతో పాటు ఆదివా సీ గిరిజనులు పాటించే సంస్కృతీ సంప్ర దాయా లతోనే మాకు గుర్తింపు ఉంది. నెలరోజులు చాలా పవిత్రతో ఉంటూ నాగోబా మహాపూజలకు ఏర్పాటు చేస్తున్నాం. ఎంత దూరమైనా కాలినడకతోనే వెళ్లి వస్తున్నాం. మా సంస్కృతిని కాపాడుకోవడం మాకు చాలా ము ఖ్యం. నాగోబా జాతర వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా భావితరాలు కూడా ఈ వేడుకను ఇలాగే నిర్వహించుకుంటారు.
-పర్ధాంజీ మెస్రం దాదారావ్