
మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు , దుర్గం చిన్నయ్య
టీఆర్ఎస్ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలు
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 27: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్‌హాలులో టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యేతోపాటు సమావేశానికి హాజరైన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై ఏళ్లకిందట టీఆర్ఎస్ను స్థాపించి శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు తెలంగాణ గాంధీగా పేరు దక్కిందని కీర్తించారు. ఉద్యమంతో సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. హిందుత్వం నినాదంతో ఉండే బీజేపీ ఎక్కడా ఆలయాలను నిర్మించలేదన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చి వారి బాగోగులు సీఎం కేసీఆర్ చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సంస్కా రం లేదని, నోరుందని దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారని, వీరిని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెటిపేట మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ఇసంపల్లి ప్రభాకర్, నల్మాసు కాంతయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, డీసీసీబీ చైర్మన్ తిప్పాని లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వసుంధర, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు గరిగంటి సరోజ, నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గంలోని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి నాయకుడూ, కార్యకర్త కృషి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలీ భవన్లో బుధవారం నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించనున్న విజయ గర్జన సభకు ప్రతి గ్రామం, వార్డు నుంచి 50 మంది కార్యకర్తలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చిన్నయ్య సూచించారు. ఈ సమవేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ఏఎంసీ చైర్పర్సన్ గడ్డం పావనీ కళ్యాణి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పార్టీ మండల, పట్టణ యూత్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, రైతు బంధు సమితి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ యూత్ కమిటీల వార్డు కమిటీ అధ్యక్షులు, కార్యవర్గసభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు