
హాజీపూర్, అక్టోబర్ 27 : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం – 2022 (ఎస్ఎస్ఆర్) ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న విడుదల చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంచిర్యాల జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో సమీక్షించారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. మార్పులు, చేర్పులపై దరఖాస్తులను స్వీకరించి నవంబర్ 2న సరి చేయాలని సూచించారు. 2022 జనవరి 5వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించాలని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మార్పులపై చర్చించాలన్నారు. ‘గరుడ’ యాప్‌పై బూత్ స్థాయి అధికారులకు పూర్తి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. ఈవీఎంలు పాత గోదాముల నుంచి కొత్త గోదాములకు మార్చాలన్నారు. ఓటరు నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, ఈవీఎంల భద్రతపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ 1న ముసాయిదాను ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల ఆర్డీవో వేణుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైద్యాధికారుల నియామక ప్రకియపై అభ్యంతరాల స్వీకరణ
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో వైద్యాధికారుల నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక జాబితా పై అభ్యంతరాలుంటే తెలుపవచ్చని కలెక్టర్ భారతీ హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సెట్ https:// mancherial.telangana.gov.in నందు పొందుపర్చడంతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నోటీసు బోర్డుపై ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 29 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.