
ఆహార భద్రత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్ రెడ్డి
ఎదులాపురం,ఆగస్టు27: రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన జన సంపదకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్ రెడ్డి అన్నారు. ఆహార భద్రతపై ఆదిలాబాద్ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడారు. 2013లో దేశంలో ఆహార భద్రత చట్టం తీసుకువచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2015 నుంచి ఈ చట్టం అమలవుతుందన్నారు. ఆహార భద్రత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. దేశంలో 25 శాతం ఆకలి మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహించాలన్నారు. పేదలకు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అందే విధంగా సదుపాయాలను సమకూర్చాలన్నారు.
రేషన్‌షాపుల ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పిల్లలు,గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరైన సమయంలో సరఫరా కావడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్‌కు వివరించారు. అంగన్వాడీ ఆయాల పోస్టులను త్వరలో భర్తీ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు సూచించారు. మధ్నాహ్నం భోజన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆర్బీఎస్కే కార్యక్రమం కింద ప్రతి విద్యార్థికీ ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు. పుడ్ ఇన్స్పెక్టర్లు నమూనాలు సేకరించి లాబొరేటరీలకు పంపించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో అందించే ఇప్ప పుప్వు లడ్డూ సంప్రదాయ పౌష్టికాహారమని అభినందించారు. జిల్లాలో అంగన్వాడీల పని తీరు బాగుందని , సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని కమిషన్ సభ్యుడు కే.గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆహార భద్రత పథకం అర్హులకు అందేలా జిల్లా యంత్రాంగం పని చేస్తున్నదని కలెక్టర్ తెలిపారు. జీసీసీల ద్వారా గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నామని ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఆర్డీవో జాడీ రాజేశ్వర్, డీఆర్డీవో కిషన్, డీఈవో రవీందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ మిల్కా, జడ్పీసీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల్లో ప్రగతి సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హరితహారం,ఎవెన్యూ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఉపాధి హామీ కూలీల పెంపు, పారిశుధ్య కార్యక్రమాలపై ఎంపీడీవోలు, ఏపీవోలతో శుక్రవారం సమీక్ష జరిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 43,64, 500 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటి వరకు 42,95, 225 మొక్కలు నాటామని 98.42 శాతం ప్రగతి సాధించినట్లు వెల్లడించారు. మల్టీలేయర్ ప్లాంటేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని బృహత్ పల్లె ప్రకృతి వనాలకు గుర్తించిన భూముల్లో గుంతలు తవ్వి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు , అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్య పనులు చేపట్టే విధంగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలు టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, డీఆర్డీవో కిషన్, జడ్పీసీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.