
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
జిల్లా కేంద్రంలో ప్లడ్ ఫీవర్ సర్వే పరిశీలన
నిర్మల్ అర్బన్, ఆగస్టు 27 :మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలకుండా చర్య లు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ ముఫారఫ్ అలీ ఫారూఖీ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఫ్లడ్ ఫీవర్ సర్వే ప్రారంభ మైంది. పట్టణంలోని శాంతినగర్ కాలనీ, గాజుల్పేట్ కాలనీలో ఫ్లడ్ ఫీవర్ సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్యారోగ్య, మెప్మా, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనికి రాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్టీలు పరిసరాల్లో లేకుండా చూడాలన్నారు. ఇంటి పైకప్పుపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జ్వరం తదితర లక్షణాలతో బాధపడితే నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీహెంచ్వో ధన్రాజ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి స్రవంతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం
పరిసరాల శుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు పట్టణంలో ఫ్లడ్ ఫీవర్ సర్వేను ప్రారంభించారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్వో లక్ష్మి, ఏఎన్ఎం ఎస్ భూదేవి, ఆశ వర్కర్ భార్గవి, అంగన్వాడీ కార్యకర్తలు శైలజ, గీతా కుమారి, ఐకేపీ ఆర్పీ శ్యామల, మెప్మా సిబ్బంది శివకుమార్, మున్సిపల్ జవాన్ సురేందర్, సిబ్బంది నవీన్ ఉన్నారు.