కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సిర్పూర్-టీ మండలంలోని మేడిపల్లి గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామానికి 153 ఇండ్లు మంజూరైనప్పటికీ ప్రారంభానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఇప్పటికే అధికారులు నాలుగు సార్లు ముగ్గుపోసేందుకు రాగా.. ఇది ఫారెస్ట్ భూమి అంటూ అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు.
ఓ శాఖ అధికారులు ఇండ్లు మంజూరు చేయడం..మరో శాఖ అధికారులు వచ్చి నిలిపివేయడంపై లబ్ధిదారులు, గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో 7 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇంతవరకు 2745 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమీక్షించి ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.. కాని క్షేత్రస్థాయిలో అటవీ- రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదం కారణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.
ఆందోళనలో లబ్ధిదారులు..
గతంలో బెజ్జూరు మండలంలోనూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సుస్మీర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అటవీ అధికారులు గతంలో కూడా ఇలాగే అడ్డుకున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈ గ్రామం లో మంజూరైన ఇండ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకోవడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. సుస్మీర్ గ్రామంలో బేస్మెంట్ జరిగిన తర్వాత ఇండ్ల నిర్మాణాలను అర్థాంతరంగా వచ్చి అటవీ అధికారులు గతంలో నిలిపివేశారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్న సంతోషంలో ఉన్న ఇంటిని తొలగించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడితే అటవీ అధికారులు ఎప్పుడు వచ్చి అడ్డుకుంటారో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగితే ఇందిరమ్మ ఇల్లు సంగతి ఎలా ఉన్న ఇంటిని కాస్త కోల్పోవాల్సి వస్తుందని లబ్ధిదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.
శాఖల మధ్య వివాదాలు తొలిగేదెన్నడో ?
అధికారుల తప్పిదాలతో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయని తెలిసి కూడా ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టు కింద ఆ గ్రామాలను ఎంపిక చేయడం.. లబ్ధిదారుల్లో ఆశలు కల్పించడం.. ఆ తరువాత రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఆ గ్రామాలు ఉన్నాయనే సాకుతో అటవీ అధికారులు ఇండ్ల నిర్మాణాలను నిలిపివేయడం జిల్లాలో సాధారణంగా మారింది.
రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం గ్రామాలను ఎంపిక చేసే సమయంలోనే వివాదాస్పద గ్రామాలను ఎంపిక చేయడంతోనే జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. సిర్పూర్-టీ మండలంలోని మేడిపల్లిలో మొదలైన వివాదాన్ని పరిష్కరించేందుకు అటవీ-రెవెన్యూ శాఖల అధికారులు జాయింట్ సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాల కాలంగా సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందనేది సమాధానం లేని ప్రశ్నగానే మారుతున్నది.
వివాదాస్పద గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు !
జిల్లాలో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదం దశాబ్దాల కాలంగా సాగుతున్నది. జిల్లాలో ఎక్కువ శాతం గిరిజనులతో పాటు, గిరిజనేతర గ్రామాలు అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉండడంతో భూముల వివాదం తెగడం లేదు. ఇలాంటి క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం పైలట్ ప్రాజెక్టు కింద ఎలాంటి వివాదాలు లేని గ్రామాలకు ఎంపిక చేయాల్సిన అధికారులు..వివాదస్పద గ్రామాలను ఎంపిక చేయడం మరింత ఇబ్బందికరంగా మారింది. మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిపల్లికి 72 ఇండ్లు, రావణ్‌పల్లి 16, లింబుగూడా గ్రామాలకు 65 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.
ఈ గ్రామాల్లో బీసీలు, గిరిజన తెగలకు చెందిన వారే ఉంటున్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందన్న కారణంగా లింబుగూడలో ఇంతవరకూ ఒక్క ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించలేదు. మేడిగూడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఇప్పటికీ అధికారులు నాలుగు సార్లు ముగ్గుపోసేందుకు రాగా.. ఇది ఫారెస్ట్ భూమి అంటూ అటవీ అధికారులు నాలుగు సార్లు అడ్డుకున్నారు. ఇక రావణ్పల్లికి 16 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 8 ఇండ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ముగ్గు పోసేందుకు వెళ్లిన అధికారులను ఇప్పటికి నాలుగు సార్లు అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఇండ్ల నిర్మాణాలు జరుగుతాయోలేదోనన్న సందేహాలు కలుగుతున్నాయి.