
విద్యార్థుల ప్రయోజనార్థమే యూనివర్సిటీల మార్పు
దళిత బంధు’ ఇతర రాష్ర్టాలకు ఆదర్శం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, ఆగస్టు 26 : విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శాంతిగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రూ.44 లక్షలతో నిర్మించనున్న ప్రహరీకి గురువారం భూమి పూజ చేశారు. కళాశాలకు వచ్చిన మంత్రికి అధ్యాపకులు, కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనం ప్రహరీ కూలిపోయిందని, దానిని కూడా నిర్మిస్తామని తెలిపారు. విద్యార్థులు దూరభారంతో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను కాకతీయ యూనివర్సిటీ పరిధి నుంచి తొలగించి తెలంగాణ యూనివర్సిటీలో కలపడంతో అందరికీ మేలు జరిగిందన్నారు. ఇక్కడి జిల్లాలను కేయూ పరిధి నుంచి తెలంగాణ యూనివర్సిటీకి మార్చాలని గతంలో అనేక సార్లు సీఎం కేసీఆర్‌కు విన్నవించామని చెప్పారు. ఆ వినతుల కారణంగా కేయూ నుంచి టీయూకు మార్చినట్లు తెలిపారు. కళాశాలలోని ఖాళీ ప్రదేశాల్లో విరివిగా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యత విద్యార్థులకు అప్పజెప్పాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను కళాశాల ఆవరణలో పరిశీలించారు. కిందికి వంగిన మొక్కను తానే స్వయంగా సరి చేశారు.
‘దళిత బంధు’ ఇతర రాష్ర్టాలకు ఆదర్శం..
దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘దళిత బంధు’ పథకం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఐకే రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ కార్యాల యం పక్కన నిర్మించిన అంబేద్కర్ భవన్ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అంబేద్కర్ భవన నిర్మాణానికి గతంలోనే రూ.2 కోట్లు మంజూరు చేశామని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అదనంగా మరో రూ.1.50 కోట్లు మంజూరు చేయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద అంబేద్కర్ భవన్ నిర్మల్‌లోనే నిర్మించుకుంటున్నామని తెలిపారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీకాంత్, పూదరి రాజేశ్వర్, నాయకులు జొన్నల మహేశ్, అడ్ప పోశెట్టి, గండ్రత్ రమేశ్, క్లాస్ వన్ కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రబాకర్, ముడుసు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.