నిర్మల్ టౌన్, జూలై 26: భైంసా మండలం కోతుల్గాం వద్ద నిర్మించిన పల్సిరంగారావుకర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గుండెగాం బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్‌లోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో ముంపునకు గురైన గుండెగాం గ్రామాన్ని అధికారులతో కలిసి సందర్శించామన్నారు. మూడు రోజుల్లో గుండెగాంలో ఉంటున్న 185 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో గుండెగాం బాధితులకు పునరావాస గ్రామం ఏర్పాటు చేయడమే కాకుండా పంట భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించామని తెలిపారు. మూడు రోజుల్లో పునరావాస జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీలు మొసలికన్నీరు కారుస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో తానూరు మండల నాయకులు బాశెట్టి రాజన్న, పోతారెడ్డి తదితరులు ఉన్నారు.
పునరావాసానికి అయ్యే ఖర్చును అంచనా వేయండి
భైంసా, జూలై, 26 : గుండెగాం పునరావాసానికి అయ్యే ఖర్చు, ఇతర వివరాలను రేపు సాయంత్రంలోగా ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలని జిల్లా అధికారులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించినట్లు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. సోమవారం నిర్మల్‌లో వరద నష్టం అంచనాపై వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారన్నారు. గుండెగాం పునరావాసానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. మంత్రి ఆదేశాలు మేరకు రేపటిలోగా పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలని కోరారు. ముథోల్ నియోజకవర్గంలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.