
రైతన్నకు అండగా నిలుస్తున్న సర్కారు
పెట్టుబడి సాయంతో సంతోషంగా సాగుతున్న కర్షకులు
తప్పిన వడ్డీ వ్యాపారుల బెడద.. బ్యాంకు అప్పులకు దూరం..
ఈ వానకాలంలో 5,66,890 మంది రైతులకు రూ.852.15 కోట్లు పంపిణీ
ఆదిలాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ సంక్షోభ నివారణ, రైతన్నకు ఆర్థిక చేయూత కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు అన్నదాతను రాజుగా మార్చేసింది. ఆశించిన లక్ష్యాలు సాధిస్తూ.. ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతున్నది.. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగగా మారి.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు.. స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారడంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ పథకంతో బ్యాంకులు, వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పింది. సీజన్‌కు ముందే డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడుతుండడంతో సంతోషంగా ‘సాగు’తున్నారు. ఇప్పటివరకు ఈ వానకాలం పంటకు సంబంధించి 5,66,890 మంది రైతుల ఖాతాల్లో రూ.852.15 కోట్లు జమ చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడేవారు. పేద రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. పంటల సీజన్ ప్రారంభమై విత్తనాలు నాటే సమయం దాటుతున్నా అప్పులు పుట్టేవి కావు. పెట్టుబడి కోసం అలసిపోయిన అన్నదాతలు దళారుల వద్ద విత్తనాలు, ఎరువులు అప్పుగా తీసుకునేవారు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీతో నకిలీ విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు రైతులకు అంటగట్టే వారు. దీంతో దిగుబడి రాక రైతులు నష్టపోయేవారు. చేతికి వచ్చిన పంటను తమకే విక్రయించాలని షరతు విధించడంతోపాటు తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఏటా కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికలు తయారు చేసే బ్యాంకు అధికారులు రైతులకు ఎక్కువ రుణాలు ఇస్తున్నట్లు వారి నివేదికల్లో చూపించేవారు. రుణాల పంపిణీలో మాత్రం పలు షరతులు విధిస్తూ తీవ్ర జాప్యం చేసేవారు. దీంతో రైతులు రెండు సీజన్లలో పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నదాతల సమస్యలకు పరిష్కారం లభించింది. తెలంగాణ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు పథకం రైతులకు ప్రయోజనకరంగా మారింది. ప్రతి సీజన్‌కూ ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు సీజన్లకు రూ.10 వేలను రైతులకు అందిస్తున్నది. రెండు సీజన్లకు ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి.
బ్యాంకు అప్పులకు దూరం
రైతుబంధు పథకం వల్ల రైతులు ఎక్కువగా బ్యాంకు అప్పులపై ఆధారపడడం లేదు. గతంలో బ్యాంకర్లు, దళారులు అప్పులు ఇస్తేగాని పంటలు సాగు చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు రైతుబంధు డబ్బులు జమ అవుతుండడంతో రైతులు వాటితో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ వానకాలం సీజన్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 3,18,026 మంది రైతులకు ప్రభుత్వం రూ.497.98 కోట్లు పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 1,47,026 లక్షల మంది రైతుల ఉండగా రూ.276.48 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,70,994 మంది రైతులకు రూ.221.50 కోట్లను సర్కారు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఎకరానికి రూ.5వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. రెండు జిల్లాల్లో ఇప్పటికే రైతులు పత్తి, సోయాబిన్, కంది పంటలు వేశారు. చేతిలో డబ్బులు ఉండడంతో తమకు నచ్చిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తామని సర్కారు అందిస్తున్న సాయంతో పంట అవసరమైన పెట్టుబడి పెట్టి అధిక దిగుబడులు సాధిస్తామని రైతులు అంటున్నారు.
రుణ సదుపాయం పెరిగింది..
మాది మామడ మండలంలోని లింగాపూర్ తండా. నాకు రెండెకరాల భూమి ఉంది. నీటి సౌకర్యం లేకపోవడంతో వానలు పడితే పంట వేసేది. వర్షాలు పడితే పంటలు పండేది లేకపోతే ఎండేది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో అప్పులు చేసేవాళ్లం. బ్యాంకుల్లో రుణం తీసుకున్న తిరిగి కట్టేందుకు చేతిలో పైసా లేకపోయేది. ఇప్పుడు ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున యేడాదికి రెండు విడుతలుగా రూ.10 వేలు ఇస్తున్నది. గత ప్రభుత్వాలు రూ.50 వేల వరకు రుణం మాత్రమే ఇచ్చేవారు. స్వరాష్ట్రంలో లక్ష వరకు రుణమిస్తున్నారు. దీనివల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తెచ్చే అవకాశం లేకుండా పోయింది.
వ్యవసాయంపై నమ్మకం పెరిగింది..
కేసీఆర్ సర్కారు 24 గంటల కరెంటుతోపాటు బ్యాంకుల ద్వారా రుణ పరిమితి పెంపు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో రైతులకు వ్యవసాయంపై విశ్వాసం పెరిగింది. ఒకప్పుడు వ్యవసాయం చేద్దామంటేనే అప్పులు చేసేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు పంటలు పండుతున్నాయి. ఒక పంట పెట్టుబడికి పోయినా మరో పంట పైసలు మిగులుతున్నాయి. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. పెట్టుబడి సాయం కింద రెండు రోజుల క్రితమే రూ.35వేలు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.
కేసీఆర్ అన్నితీర్ల ఆదుకుంటున్నడు
కన్నెపల్లి, జూన్ 26 : నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. సర్కారోళ్లు ఈ మధ్యనే రైతుబంధు పథకం కింద పెట్టుబడికి డబ్బులిచ్చిన్రు. నా ఖాతాల రూ.17,500 పడ్డయ్. బ్యాంకుకు పోయి డబ్బులు తీసుకున్న. పొలం పనులు మొదలు జేసిన. విత్తనాలు, ఎరువులు కొనుక్కున్న. ఇది వరకున్న గవర్నమెం టోళ్లు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. కరంటు ఉంటే.. నీళ్లుండకపోయేటివి.. విత్తనాలు, ఎరువుల కోసం మస్తు తిప్పలయ్యేది. ఇగ పెట్టుబడి కోసం సావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. ఎట్లనో అట్ల పంట వేసినా.. దిగుబడి మొత్తం వడ్డీలకే సరిపోయేవి. మస్తు మంది ఇగ గీ ఎవుసం చేయలేమని పట్టణాలకు పోయినోళ్లు ఉన్నరు. తెలంగాణ వచ్చి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బాధలన్నీ పోయినయ్. రైతులను అన్నితీర్ల ఆదుకుంటున్నరు. పట్టణాలకు పోయినోళ్లు సైతం ఊర్లళ్లకు వచ్చి ఎవుసం చేసుకుంటున్నరు.