
గుడుంబా స్థావరాలపై దాడులు
రూటు మార్చిన తయారీదారులు
ఈ ఏడాది భారీగా బెల్లం పానకం,గుడుంబా స్వాధీనం
223 మందిపై 397 కేసులు ,16 వాహనాలు సీజ్
ఎక్సైజ్ శాఖ అధికారుల వెల్లడి
ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 25: ఎక్సైజ్ శాఖ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు చేస్తున్నా తయారీ దారులు మాత్రం తమ దందాపై వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలి కాలంలో వరుసగా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు విస్తృతం చేశారు. దీంతో తయారీదారులు తమ ఇండ్లు, పంట పొలాలను వదిలి ఇతర ప్రాంతాల వైపు తమ మకాం మార్చతున్నారు. నివాస గృహాలు, తోటల్లో గుడుంబా తయారు చేసే వారు. కాని ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి నీటి లభ్యత ఉండే రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. గుడుంబా తయారీకి అనువుగా ఉంటుందని ఖానాపూర్, కడెం మండలాల్లో గోదావరి ప్రాంతాల వైపు దృష్టి సారించారు. నీటి లభ్యత ఎక్కడ అనువుగా ఉందో అక్కడి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాలకు వాహనాల రాకపోకలకు రహదారి సౌకర్యం లేని ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు, దాడులు నిర్వహించారు. పలు మండలాల్లో కొన్ని కిలో మీటర్ల మేర వెళ్లి తనిఖీలు చేపట్టారు. వేలాది లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. వందలాది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులు నమోదు చేశారు.
ఏడాదిలో 43.700 లీటర్ల బెల్లం పానకం,950 లీటర్ల గుడుంబా స్వాధీనం
ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో డ్రమ్ముల్లో పులియ బెట్టిన 43.700 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి పాల్పడ్డ 223 మందిపై 397 కేసులు నమోదు చేశారు. ఎగ్బాల్పూర్, సత్తనపెల్లి, సుర్జాపూర్ దాబాల్లో 149.25 లీటర్ల మద్యం, 113 బీరు బాటిళ్లను పట్టుకున్నారు. పలు గ్రామాల్లో 950 లీటర్ల గుడుంబా, 7.8 లీటర్ల గుల్ఫారాం స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి ఉపయోగించే 2.580 కిలోల పటిక, 7.456 కిలోల నల్ల బెల్లం, 2.275 కిలోల ఎండు గంజాయి (48 మొక్కలు)ని పట్టుకున్నారు. 15 బైక్లు, ఆటోను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రెండు నెలల క్రితం పలువురిని ఆయా మండలాల్లోని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.