
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 25 : లోకల్ క్యాడర్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు రెండోరోజైన శనివారం ఆయా కార్యాలయాల్లో రిపోర్టు చేశారు. ఆదివారం చివరి రోజు కావడంతో ఎక్కువ మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒకరోజు ముందే ఆయా కార్యాలయాల్లో రిపోర్టు పత్రాలు అందజేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి భారీగా ఉపాధ్యాయులు తరలివచ్చి తమ జాయినింగ్ రిపోర్టులను ఇచ్చారు. కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ అప్పీలు చేసుకోవడానికి ఉమ్మడి జిల్లా నుంచి కొందరు ఉపాధ్యాయులు వచ్చి అర్జీలు సమర్పించారు.
కౌన్సెలింగ్కు ఏర్పాట్లు..
బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లలో జిల్లా విద్యాశాఖ అధికారులు బిజీగాఉన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోనే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారి సీనియారిటీ లిస్టులు, ఖాళీ స్థానాల గుర్తింపు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అనంతరం లిస్టులు విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచనున్నారు.