
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
శుభకార్యానికి వెళ్లి వస్తున్న ఇద్దరు, చర్చికి వెళ్తున్న ఒకరు దుర్మరణం
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 25 : పండుగపూట విషాదం నెలకొంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమించి రిమ్స్‌లో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సీఐ సైదారావు తెలిపిన వివరాల మేరకు.. నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి జాదవ్ సుస్విన్(21), అదే గ్రామానికి చెందిన కుటుంబే భావేశ్(22) స్నేహితులు. ఇంద్రవెల్లిలో వారి మిత్రుడి ఎంగేజ్మెంట్ ఉండడంతో ఇద్దరూ పల్సర్ బైక్‌పై వెళ్లారు. కార్యక్రమం ముగించుకొని అదే రోజు అర్ధరాత్రి ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఉట్నూర్ మండలం పెర్కగూడ గ్రామానికి చెందిన దుర్గం నరేశ్(25) క్రిస్మస్ పండుగ సందర్భంగా తన భార్య రజినితో కలిసి ఇంద్రవెల్లిలోని చర్చికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో కుమ్మరితండా మలుపు వద్ద ఎదురెదురుగా రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. జాదవ్ సుస్విన్, కుటుంబే భావేశ్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గ నరేశ్, అతని భార్య రజినికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు, సమీప గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నరేశ్, రజినిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి నరేశ్ మృతచెందాడు. రజిని ప్రస్తుతం చికిత్స పొందుతున్నది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
పళ్లైన ఆరు నెలలకే..
మండలంలోని పెర్కగూడ గ్రామానికి చెందన దుర్గం రమేశ్‌కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. చిన్నవాడైన నరేశ్‌కు ఆరు నెలల క్రితమే పెళ్లయ్యింది. వ్యవసాయం చేసుకుంటూ తండ్రికి తోడుగా ఉంటున్నాడు. క్రిస్మస్ పండుగకు ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో చిన్న కొడుకు దుర్గం నరేశ్, భార్య రజినితో కలిసి ఇంద్రవెల్లి చర్చిలో ప్రార్థనలు చేయడానికి అర్ధరాత్రి బైక్‌పై బయలు దేరారు. కుమ్మరితండా వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన భార్య చికిత్స పొందుతున్నది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పళ్లైన ఆరు నెలలకే ఈ దుర్ఘటన జరగడంతో వారి దుఃఖానికి అవధుల్లేకుండాపోయాయి.
తాడిహత్నూర్‌లో విషాదం..
నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన కుటుంబే సూర్యప్రకాశ్‌కు ఇద్దరు కొడకులు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కొడుకు కుటుంబే భావేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా.. అదే గ్రామానికి చెందిన జాదవ్ విలాస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు కాగా.. 12 ఏండ్ల వయస్సులోనే ఒకరు చనిపోయారు. చిన్న కొడుకైన సుస్విత్ను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.