తరగతి గదులను శుభ్రం చేయించాలి
జడ్పీ సీఈవో కే నరేందర్
నెన్నెల,ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండంతో పాఠశాలలలో పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులను జడ్పీ సీఈవో కే నరేందర్ ఆదేశించారు. పాఠశాలలో గదులను శుభ్రపరిచి శానిటైజ్ చేయించాలన్నారు. తాగునీరు, మూత్రశాలలు, తదితర వసతులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలనుకనుగుణంగా పాఠశాలలు నడుచుకోవాలని సూచించారు. పదహారు నెలలుగా పాఠశాలలు తెరుచుకోలేదని విద్యార్థులు నెలల తరబడిగా ఇండ్లకే పరిమితమయ్యారన్నారు. ప్రతి రోజూ విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చూడాలన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పాఠశాలలకు నిత్యం వస్తున్న ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం , డంప్ యార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ సంతోషం రమాదేవి, ఎంపీడీవో వరలక్ష్మి, సర్పంచ్ చీర్ల సత్తమ్మ , ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేశ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, ఆగస్టు 25 : కోటపల్లి తో పాటు వెల్మపల్లి, రాజారం, లింగన్నపేట, ఎడగట్ట, రాపనపల్లి, పారుపల్లి, లక్ష్మీపూర్ తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించారు. పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ తెలిపారు.
పారిశుధ్య పనులు పరిశీలన
బెల్లంపల్లిటౌన్, ఆగస్టు 25 : పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న తాగునీరు, శానిటైజేషన్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత పర్యవేక్షించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని చైర్‌పర్సన్‌కు హెచ్ఎం విన్నవించారు. మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కౌన్సిలర్ లావణ్య, నాయకులు నెల్లికంటి శ్రీధర్, మురళి తదితరులున్నారు.
తాండూర్ మండలంలో..
తాండూర్, ఆగస్టు 25 : పాఠశాలలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈవో వాసాల ప్రభాకర్ తెలిపారు.
చెన్నూర్ మండలంలో..
చెన్నూర్, ఆగస్టు 25: చెన్నూర్ పట్టణంలోని పలు పాఠశాలల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. పట్టణంలోని పలు పాఠశాలల ఆవరణలో పారిశుధ్య పనులు నిర్వహించి, క్లోరినేషన్ చేశారు. తరగతి గదులను శుభ్రం చేశారు. ఈ పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనా గిల్డా, కమిషనర్ ఖాజా మొయిజొద్దీన్, మండల విద్యాధికారి రాధాకృష్ణమూర్తి పర్యవేక్షించారు.
ఉపాధ్యాయులు, కార్యదర్శులతో సమావేశం
కాసిపేట, ఆగస్టు 25 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎంఏ అలీం ఆధ్వర్యంలో మండలంలోని ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో క్లోరినేషన్, పరిశుభ్రత, సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించడం, తదితర పనులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దామోదర్‌రావు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
పాఠశాలలను శానిటైజ్ చేయించాలి
వేమనపల్లి, ఆగస్టు 25 : మండలంలోని పాఠశాలల్లోని తరగతి గదులను శానిటైజ్ చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీవో అనిల్‌కుమార్ ఆదేశించారు. వేమనపల్లిలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించాలన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో..
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 25 : సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ఆయా సర్కారు బడులను హెచ్ఎంలు సిద్ధం చేస్తున్నారు. పాఠశాలలను శుభ్రం చేయడం, తాగునీరు, మరుగుదొడ్లను శుభ్రం చేయించడం తదితర పనులు చేయిస్తున్నారు. మరోవైపు ఆయా మండలాల విద్యాధికారులు, ఎంపీడీవోలు పనులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఎంఈవో పోచయ్య పరిశీలించగా హాజీపూర్ మండలంలో ఎంపీడీవో అహ్మద్ హై తిరిగి పరిశీలించారు.