
57 ఏండ్లు నిండిన వారికి అవకాశం ఇవ్వడంతో బారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 59,615 మంది అర్హులు
ఆదిలాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆసరా ద్వారా అసహాయులు, అభాగ్యులకు అండగా నిలుస్తున్న సర్కారు.. కొత్తగా 57 ఏండ్లు నిండినవారికి కూడా వృద్ధాప్య పింఛన్ అవకాశం కల్పించింది. ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. అర్హులు మీసేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఈనెల 31 వరకు అవకాశం ఉండగా.. సెంటర్స్ వద్ద సందడి నెలకొంది. సమయం దగ్గర పడుతుండడంతో దరఖాస్తు చేసుకునే ఇంటికి వెళ్తున్నారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 59,615 మంది అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో కొత్త పింఛన్‌దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులు పింఛన్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. లబ్ధిదారుల్లో ఏవరైనా చనిపోతే కానీ కొత్తవి వచ్చేవి కావు. అన్ని విధాలుగా అర్హులైన వారు కూడా పైరవీలు చేసుకోవాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లు గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులకు నెలనెలా ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నది. వారి అవసరాలను తీర్చుతున్నది. ప్రతి నెలా రూ.2016, దివ్యాంగులకు రూ.3016 అందించి అండగా నిలువడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో గౌరవంగా జీవించేలా చేయూతనిస్తున్నది. ఎన్ని సమస్యలు ఉన్నా నెలనెలా అర్హులందరికీ పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,34,649 మంది లబ్ధిదారులకు సర్కారు ‘ఆసరా’ అందిస్తున్నది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. అర్హులైన వారందరూ ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మీ సేవ కేంద్రాల్లో వివరాల నమోదు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57 ఏండ్లు నిండిన లబ్ధిదారులు 59,615 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 10,531, నిర్మల్ జిల్లాలో 18,815, మంచిర్యాల జిల్లాలో 17,269, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,000 మంది ఉన్నారు. కాగా, లబ్ధిదారులు సమీప మీ సేవ కేంద్రాల్లో తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆధార్‌కార్డు, ఫొటో, ఇతర పత్రాలతో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,34,649 మందికి సర్కారు ప్రతి నెలా పింఛన్ అందిస్తుంది. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 65,682, నిర్మల్ జిల్లాలో 1,35,908, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 47,578, మంచిర్యాల జిల్లాలో 85,481 మంది ఉన్నారు. కొత్తగా మంజూరయ్యే వాటితో ఉమ్మడి జిల్లాలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 3,94,264కు చేరనున్నది. ప్రభుత్వం మంజూరు చేయనున్న కొత్త పింఛన్‌పై అర్హులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు అందరికీ సాయం చేస్తుంది.
తెలంగాణ సర్కారు అందరికీ సాయం చేస్తుంది. రైతులు పంటలు సాగు చేసుకునేందుకు పైసలు ఇస్తున్నది. ముసలోళ్లకు పింఛన్లు కూడా ప్రతినెలా మంజూరు చేస్తున్నది. నాకు 57 ఏండ్లు దాటినయ్. మా అసొంటోళ్లకు కేసీఆర్ సర్కారు పింఛన్ ఇచ్చుడు సంతోషంగా ఉంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఆదిలాబాద్‌కు వచ్చిన.
సంతోషంగా ఉంది..
కేసీఆర్ సారు 57 ఏండ్లు దాటినోళ్లకు పింఛన్లు ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మా ఊరి నుంచి అందరం కలిసి ఆదిలాబాద్‌కు వచ్చినం. మీ సేవల ఆధార్‌కార్డు, ఫొటోలు ఇచ్చి, మా వివరాలు నమోదు చేసుకున్నం. సర్కారు ఇచ్చే పింఛన్ పైసలు గరిబోళ్లకు ఎంతో ఉపయోగపడుతాయి.