
జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి
ఉపాధ్యాయులతో సమావేశం
ఇంద్రవెల్లి, ఆగస్టు 25 : సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నందున ఈ నెల 31 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవో రవీందర్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, సమస్యలు, పారిశుధ్య పనులు, తాగునీటి, మధ్యాహ్న భోజనంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించడం, తరగతి గదులు, తాగునీటి ప్లాంట్‌ను శుభ్రం, శానిటేషన్, పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌సింగ్ తిలావత్, ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి విద్యార్థులకు వందశాతం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో నారాయణ, జిల్లా పరిషత్ పాఠశాల చైర్మన్ బాపురావ్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఉట్నూర్, ఆగస్టు 25 : పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీవో తిరుమల అన్నారు. పెర్కగూడ, చాందూరి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే శుభ్రం, శానిటేషన్ పనులు చేయించాలని సర్పంచ్ హరినాయక్‌కు సూచించారు. ఆమె వెంట ఎంపీవో మహేశ్, ప్రధానోపాధ్యాయురాలు చౌహాన్ సీతల్, ఉపాధ్యాయులు ఉన్నారు.
పాఠశాలల్లో పారిశుధ్య పనులు
తాంసి, ఆగస్టు 25: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. పారిశుధ్య నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం గ్రామాల సర్పంచ్‌లకు అప్పగించింది. దీంతో పంచాయతీ సిబ్బంది తరగతి గదులు, పరిసరాలను శుభ్రం చేయడం, రంగులు వేయడం పనుల్లో నిమగ్నమయ్యారు.
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 25: రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈవో సత్యనారాయణ పంచాయతీ సిబ్బందితో పిచ్చి మొక్కలు తొలగించడం, శానిటేషన్ పనులు చేయించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని పాఠశాలలను శుభ్రం చేయిస్తామని తెలిపారు.