
ఎకరంన్నరలో గోబీ, అల్చింత, బెండ, టమాట, కొత్తిమీర, మెంతి సాగు
నిత్యం ఆసిఫాబాద్, వాంకిడి మార్కెట్లలో విక్రయం
ఒక్కో పంటపై పెట్టుబడి పోను రూ. 50 వేల దాకా ఆదాయం
ఆదర్శంగా నిలుస్తున్న ఘాట్ జన్గాం రైతు మోర్లె సుధాకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పత్తి, వరి, కంది సాగుతో నష్టపోయిన ఆ రైతు కూరగాయల వైపు మళ్లాడు. తనకున్న ఎకరంన్నరలో గోబీ, టమాట, బెండకాయ, అల్చంత, కొత్తిమీర, మెంతి వేసి లాభాల బాట పట్టాడు. ప్రస్తుతం మార్కెట్లో వెజిటేబుల్స్కి మంచి ధర పలుకుతుండగా, నిత్యం తరలిస్తూ ఆదాయం పొందుతున్నాడు. ఒక్కో పంటపై పెట్టుబడి పోను రూ. 50 వేల దాకా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వాంకిడి మండలం ఘాట్జన్గాంకు చెందిన మోర్లె సుధాకర్.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఘాట్ జన్గాం గ్రామానికి చెందిన రైతు మోర్లె సుధాకర్‌కు ఎకరంన్నర భూమి ఉంది. గతంలో పత్తి, కంది, వరి సాగు చేశాడు. ఈ పంటల ద్వారా వచ్చే డబ్బులు పెట్టుబడికి కూడా సరిపోవడం లేదని తెలుసుకున్నాడు. ఇగ లాభం లేదనుకొని ఐదేళ్ల క్రితం కూరగాయల సాగు వైపు మళ్లాడు. ఉన్నది కొద్దిపాటి భూమే అ యినా సుమారు రూ. లక్ష వరకు ఖర్చుపెట్టి బోరు వేయించాడు. ఒక్కో పంటకు నిర్ణీత స్థలాన్ని కేటాయించుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో 20 గుంటల్లో గోబీ, 10 గుంటల్లో బెండ, 10 గుంట ల్లో అలసంద, 10 గుంటల్లో టమాట, మరో 10 గుంటల్లో మెంతి, కొత్తిమీర సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం గోబీ, బెండ, అలసంద, మెం తి, కొత్తిమీర పంట చేతికొస్తుండగా, వాంకిడి, ఆసిఫాబాద్ మార్కెట్లలో విక్రయిస్తున్నాడు. పంట చేతికొచ్చినప్పటి నుంచి మూడు నెలల పాటు ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నాడు.
ఒక్కో పంటపై రూ. 50 వేల దాకా ఆదాయం
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయాలకు మంచి డిమాండ్ ఉంది. బెండకాయ ధర హోల్‌సేల్‌లో కిలోకు రూ. 40 వరకు, గోబీ రూ. 50, అలసంద కిలోకు రూ.25, మెంతి, కొత్తిమీర కిలోకు రూ. 100 నుంచి రూ.150 వరకు ధర పలుకుతుంది. నిత్యం మార్కెట్‌కు తరలిస్తూ ఆదాయం పొందుతున్నాడు. ఇప్పటి వరకు సుమారు 10 క్వింటాళ్లకు పైనే గోబీని మార్కెట్‌కు తరలించాడు. ఇంకా నాలుగైదు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరో పది రోజుల్లో టామట పంట కూడా చేతికి రానున్నది. తన పెట్టుబడి మొత్తం రెండు మూడు వారాల్లోనే తిరిగి వస్తుందని, ఆ తర్వాత తనకు వచ్చేదంతా లాభమేనని అంటున్నాడు. ఒక్కో పంటపై రూ. 50 వేల దాకా ఆదాయం వస్తుందని చెబుతున్నాడు.
ఒక్కో పంటపై రూ. 50 వేల దాకా మిగులుతున్నయ్
ఇది వరకు పత్తి, కంది, వరి వేసేటోన్ని. పెట్టుబడి మందం అయినా మిగుల్తలేవు. అందుకే నాకున్న ఎకరంన్నరలో కూరగాయలు వేయాలనుకున్న. ఈసారి గోబీ, టమాట, బెండ, అలసంద, కొత్తిమీర, మెంతి వేసిన. ఒక్కో పంట సాగుకు రూ. 5 వేల దాకా పెట్టుబడి అయింది. ఇప్పుడు పంటలు చేతికి వస్తున్నాయి. మరో వారం 10 రోజుల్లో టమాటలు కూడా తెంపుత. ప్రతి రోజూ వాంకిడి, ఆసిఫాబాద్ మార్కెట్లకు కూరగాయలు తీసుకెళ్తున్న. చేతినిండా డబ్బులుంటున్నయి. ఒక్కో పంటపై పెట్టుబడి పోను రూ. 50 వేల దాకా మిగులుతున్నయ్.