
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ త్యాగాల పునాదులపై ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక, ప్రత్యేక చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నడుంకట్టారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న కేసీఆర్, 2001 ఏప్రిల్ 27న డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. అనంతరం స్వరాష్ట్ర సాధనకు నిరంతరం కృషి చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించారు. దీంతో పాలన చేరువై సంక్షేమ ఫలాలు అందుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతింతై.. స్వరాష్ట్ర సాధన..
2001లో ఒక్కరితో ప్రారంభమైన పార్టీ.. నేడు విశ్వవ్యాపితమైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ర్టాన్ని సాధించుకుంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ పార్టీ ట్యాగ్‌లైన్‌గా వాటినే పెట్టుకున్నారు. గెలిచిన ప్రతి సందర్భంలోనూ పార్టీ నాయకులు ప్రత్యేక తెలంగాణ కోసమే ఉద్యమించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. రాస్తారోకోలు, సాగరహారాలు, మిలియన్ మార్చ్‌లు, సకలజనుల సమ్మెతో ఉద్యమ ఆకాంక్షను తెలిపారు. పదవులను గడ్డిపోచల్లా భావించి రాజీనామాలు చేశారు. దీంతో ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ అభ్యర్థులకే ప్రజలు పట్టంగట్టారు. ఉద్యమసారథి వెంట నడిచి, రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పాటునందించారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సైతం పలు వరాలు కురిపించగా, వారంతా ఆది నుంచీ కేసీఆర్ వెంటే ఉన్నారు.
అభివృద్ధి చూసే పార్టీలోకి..
2001లో కేసీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మంచిర్యాల జిల్లా నుంచి పలువురు ఆయన వెంట నడిచారు. ఆయన పనితీరుకు మెచ్చి, మరికొందరు మధ్యలో పార్టీలో చేరారు. ప్రస్తుతం ప్రతిపక్షమే లేని ఏకైక పార్టీగా ఆవిర్భవించి ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నది. ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదును కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లాలో 3 నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వ నమోదు చేయాలని అధిష్టానం సూచించగా లక్ష్యానికి మంచి చేసి ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను గుర్తు చేశారు. 50 వేలు దాటాక తమను కూడా పార్టీలో చేర్చుకోవాలని పలువురు ముందుకు రాగా, వారి కోసం లక్ష్యం మించి సభ్యత్వం చేశారు. అన్ని రకాల వారికీ అభివృద్ధి ఫలాలు అందుతుండడంతో టీఆర్ఎస్ వెంటే నడుస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా ముందుకెళ్తున్న పార్టీకి అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్కే పట్టంగట్టారు. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి, కృతజ్ఞతను చాటుకున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని ఇండ్లల్లోనూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంక్షేమ పథకం పొంది ఉంటారనేది అందరికీ తెలిసిందే. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. కుదేలవుతున్న కులవృత్తులకు జీవం పోశారు.విద్య, వైద్యానికి పెద్ద పీట వేశారు. అంపశయ్యపై ఉన్న ఆర్టీసీని బతికించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేలా పలు శాఖలకు నిధులు మంజూరు చేశారు. అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ఏర్పా టు, ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అడుగడుగునా అభివృద్ధి చెందింది.
పాలన సౌలభ్యం కోసం జిల్లా ఏర్పాటు
స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర రాష్ర్టాలకు ముఖ్యమంత్రి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. వికేంద్రీకరణతోనే జిల్లాలు బాగుపడతాయని విస్తరణకు తీవ్రంగా కృషి చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం పరితపించి మరిన్ని జిల్లాలను ఏర్పాటు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం 2016లో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం, పునర్వవ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 52 పాత మండలాల నుంచి 14 మండలాలతో మంచిర్యాల జిల్లా పరిపాలన కేంద్రంగా ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విడిపోయి మంచిర్యాల ప్రత్యేక జిల్లాగా 2016, అక్టోబర్ 11న ఏర్పడింది. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిన్న జిల్లా ఏర్పాటు తర్వాత పాలన, పర్యవేక్షణ విషయాల్లో మెరుగైన మార్పు వచ్చింది. వివిధ శాఖల అధికారులతో పాటు కలెక్టర్ కూడా గంటలో ఎక్కడికైనా వెళ్లే వీలు కలిగింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చాయి. పారిశ్రామిక, పర్యాటక, అటవీ పాంత్రం ఉండడంతో ఉపాధి ఖిల్లాగాను ఉంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలో విద్యారంగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. రవాణా వ్యవస్థ మెరుగుపడింది. వైద్య సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నది. పరిశ్రమలు, అభివృద్ధి పనులకు సర్కారు మరింత తోడ్పాటు అందిస్తున్నది. ప్రభుత్వ విద్య బలోపేతంలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేశారు.