
ఏర్పాట్లు చేసిన అధికారులు
గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
డీఐఈవో శ్రీధర్ సుమన్
సంబంధిత అధికారులతో సమీక్ష
ఆసిఫాబాద్, అక్టోబర్ 24 : జిల్లాలో నేటినుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలాఉంటే డీఐఈవో శ్రీధర్ సుమన్ ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 4326 మంది జనరల్ విద్యార్థులు, 882 ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హా జరుకానున్నారని, ఇందుకోసం 24 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మా స్కు ధరించి హాల్ టికెట్ ,శానిటైజర్ తెచ్చుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు వైద్య సిబ్బందిని నియమించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు నైతం శంకర్, తిరుపతి, పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ..
జిల్లాకేంద్రంలోని పీటీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ సురేశ్ విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, సంతోష్, జుగాదిరావు, శ్రీనివాస్ ఉన్నారు.
మండలంలో 430 మంది విద్యార్థులు..
కౌటాల, అక్టోబర్ 24: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్వరూప ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 430 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. జూనియర్ కళాశాలలో 228 మంది, జడ్పీ పాఠశాలలో 202 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. కళాశాలలో సీఎస్‌గా స్వరూప, డీఎస్‌గా సునీత, జడ్పీ పాఠశాలలో సీఎస్‌గా మార్త రమేశ్, డీఎస్‌గా జ్ఞానేశ్వర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు.