
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు, కలెక్టర్
క్వింటాల్‌కు రూ.7200-రూ.7400 ధర పలికే అవకాశం
lమార్కెట్‌యార్డుకు చేరుకుంటున్న దూది వాహనాలు
ఆదిలాబాద్, అక్టోబర్ 24 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో వానకాలంలో రైతులు ఎక్కువగా పత్తిని పంటను సాగు చేస్తారు. మంచి లాభాలు ఇస్తుండడంతో యేటా విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 3.90 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, 27 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలుకు రూ.6025 మద్దతు ధర ప్రకటించగా, జిల్లాలోని 9 మార్కెట్‌యార్డుల్లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర ఎక్కువగా ఉండడంతో పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో మహారాష్ట్రకు చెందిన ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువగా రూ.7200 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించిన ఈ నెల 12న ఎమ్మెల్యేలు, కలెక్టర్ సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని, ఇతర జిల్లాల్లో చెల్లిస్తున్న ధరను జిల్లాలో ఇక్కడ కూడా చెల్లించాలని జిన్నింగ్ వ్యాపారులకు సూచించారు. నేడు పత్తి కొనుగోళ్లను ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించనున్నారు. ఒక రోజు ముందుగానే ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు పత్తి వాహనాలు చేరుకున్నాయి.