
కేంద్రానికి వచ్చిన కేసులు: 566
పరిష్కరించినవి:347
పెండింగ్: 119
టోల్‌ఫ్రీ నంబర్- 181,
నిర్మల్ సఖి కేంద్రం సెల్ నంబర్: 8500540181
నిర్మల్ చైన్‌గేట్, అక్టోబర్ 24: వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, పోక్సో, మిస్సింగ్, చీటింగ్, ప్రేమ పేరుతో వేధింపులు, వరకట్నం తదితర సమస్యలతో బాధపడుతున్న మహిళలు సఖి కేంద్రాలకు వస్తున్నారు. నిర్మల్ జిల్లా సఖి కేంద్రంలో ఇప్పటివరకు 566 కేసులు వచ్చాయి. అందులో 347 పరిష్కరించగా 119 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఐదు రకాల సేవలు..
బాధిత మహిళలకు సఖి కేంద్రాల నుంచి ఐదు రకాల సేవలందిస్తున్నారు. వైద్య సహాయం, తాత్కాలిక వసతి, న్యాయ సలహా, కౌన్సెలింగ్, పోలీస్ రక్షణ తదితర సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు పగలు, రాత్రి సమయంలో బాధిత మహిళలు విపత్కర పరిస్థితుల్లో ఉంటే తక్షణమే తమ వాహనంలో వెళ్లి సఖి కేంద్రానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు.
రాజీ ద్వారా సమస్యలు పరిష్కారం..
సఖి కేంద్రాలకు వచ్చే వాటిలో గృహహింస, భార్యాభర్తల మధ్య తగాదాలు, మనస్పర్థలు, వరకట్నం, అత్తామామల వేధింపులు, అడపడుచులు, తోటికోడళ్లతో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. బాధిత మహిళలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గృహహింస చట్టంపై అవగాహన కల్పించి, శిక్షల గురించి వివరిస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధిత మహిళలకు న్యాయం చేస్తున్నారు.
కౌన్సెలింగ్ ద్వారా ఒక్కటైన జంట
జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు ఇష్టం లేక ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహం జరిపించినా కొన్నేళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఆ మహిళ తన సమస్యను పరిష్కరించాలని జిల్లాలోని సఖి కేంద్రానికి వచ్చింది. దీంతో కేంద్రం నిర్వాహకులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక్కటి చేశారు. ఇలాంటి సమస్యలు ఎన్నో పరిష్కరిస్తున్నారు.