
కామన్ సర్వీస్ సెంటర్లతోగ్రామీణ యువతకు ఉపాధి
ప్రజలకు తగ్గుతున్న ఖర్చులు, తొలగిన ఇబ్బందులు
ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 23: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ అవసరమొచ్చినా గతంలో మండల కేంద్రానికి వెళ్లి రావాల్సి వచ్చేది. దీంతో రాకపోకలకు వ్యయప్రయాసలుండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆన్లైన్ సేవలను ప్రజలకు చేరువ చేసింది. విద్యార్థి, యువత, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగార్థులు, ఆయా పథకాలకు సంబంధిత మండల, పట్టణంలోని కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం తగ్గింది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలతో దూరాన ఉన్న బ్యాంకులకు వెళ్లడం తప్పింది. పట్టణాలు, కొన్ని మండల కేంద్రాల్లో కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం తాజాగా గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో కొత్తగా గ్రామాల్లో మరిన్ని సీఎస్సీల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నది.
సీఎస్సీల ద్వారా అందుతున్న సేవలు
వ్యవసాయానికి సంబంధించి కిసాన్ ఈ స్టోర్ వెబ్సైట్ ద్వారా విత్తనాలు, ఎరువులు, సామగ్రి సీఎస్సీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. టెలీ లా ద్వారా న్యాయ సహాయం పొందే విధానం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో భార్యాభర్తల గొడవలు లాంటివి, న్యాయవాదుల దగ్గరికి వెళ్లి ఫీజులు చెల్లించే స్థితిలో లేనివారు సీఎస్సీల ద్వారా ఫోన్ నంబర్లతో వారి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉచిత న్యాయ సహాయం పొందుతున్నారు. జిల్లా కేంద్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు రైతులు నేరుగా పొందవచ్చు. పంట చేనులోకి వెళ్లి కూడా శాస్త్రవేత్తల సలహాలు ఇప్పించే అవకాశం ఉన్నది. ఇక డిజిటల్ పే సిస్టంలో ఆధార్ ద్వారా చెల్లింపులు అవుతున్నాయి. ఆన్లైన్ పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ నమోదు సేవలున్నాయి. ఇక ఇప్పుడు సీఎస్సీలు మినీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లుగా యువతను నియమించి ఉపాధి కల్పిస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్నది. ఇంటికే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. సీఎస్సీలో జీవితబీమా సహా ఇతర బీమాలు, ఫాస్టాగ్ సర్వీసులు అందుబాటులో ఉండడంతో సామాన్యులు కార్యాలయాలకు తిరిగే వ్యయప్రయాసాలు తగ్గుతున్నాయి.
గ్రామాల వినియోగదారులకు ప్రయోజనం
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా సీఎస్సీ కేంద్రాల ఏర్పాటు చేస్తుండడం హర్షణీయం. దీంతో మారుమూల గ్రామాల వారు వివిధ పనులకు మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వచ్చే తిప్పలు తప్పుతాయి. ఇక నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించినట్లవుతుంది. ప్రస్తుతం ప్రతి దరఖాస్తు, చెల్లింపులు డిజిటల్ అయినందున సీఎస్సీ కేంద్రాలతో అందరికీ మేలు జరుగుతుంది.
అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఆధునిక సమాజంలో ఇప్పుడు అన్ని వర్గాల వారికి వివిధ సేవలను అందించడానికి సీఎస్సీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో మరిన్ని సీఎస్సీలను ఏర్పాటు చేస్తుండడంతో సామాన్యులందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు వేగంగా అందుతాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.