
సైబర్ బాధితులు 155260, 100కు ఫోన్ చేయాలి
పోలీసు అధికారులతో సమీక్షా సమావేశంలో ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
ఏఎస్ఐ డేవిడ్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత
ఎదులాపురం, ఆగస్టు 23 : శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషిచేయాలని పోలీసు అధికారులకు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో సోమవారం పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా వర్టికల్ విభాగంలో కేటాయించిన విధులపై సీనియర్ ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోలీస్ స్టేషన్లో 5 ఎస్ విధానం అమలు తీరుపై ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. క మ్యూనిటీ పోలీసింగ్, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, షీ టీం, యాంటీ హ్యూ మన్ ట్రాఫికింగ్ యూనిట్, టాస్క్ ఫోర్స్, మహిళల భద్రత, మిస్సింగ్ కేసులు, ఈ చలాన్లు, పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, కోర్డు కేసులు తదితర వాటిపై చర్చించి, పోలీస్ అధికారులతో వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్ విభాగంలో భాగంగా ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా 83 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటి పనితీరుపై రెండు డివిజన్లలోని ఐటీ కోర్ పోలీసు టీం సభ్యులతో సమీక్షించాలని సూచించారు. పనిచేయని చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. బ్యాంకు ఖాతా నుంచి నగదు పోగొట్టుకున్న బాధితులు 155260 లేదా డయల్ 100కు ఫోన్ చేస్తే కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. బాధితులు త్వరగా సమాచారం అందిస్తే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించి, డబ్బు జమ అయిన సైబర్ నేరగాళ్ల ఖాతా నుంచి డ్రా చేయకుండా నిలువరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ్, అదనపు ఎస్పీలు సీ సమయ్ జాన్‌రావు, బీ వినోద్ కుమార్, డీఎస్పీలు ఎన్ ఎస్వీ వెంకటేశ్వరరావు, ఎన్ ఉదయ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ జీ మల్లేశ్, డీసీఆర్బీ సీఐ జాదవ్ గుణవంత్‌రావు, ట్రాఫిక్ సీఐ ఏ రాంనరసింహారెడ్డి, పట్టణ సీఐలు పోతారం శ్రీనివాస్, ఎస్ రామకృష్ణ, కే పురుషోత్తంచారి, జైనథ్ సీఐ కొంక మల్లేశ్ ఇచ్చోడ సీఐ కంప రవీందర్, పోలీస్‌స్టేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేత..
ఎదులాపురం, ఆగస్టు 23 : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉట్నూర్ ఏఎస్ఐ ఏబ్నేజర్(డేవిడ్) మృతిచెందగా, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును ఆయన సతీమణి వాస గంగామణికి ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అందజేశారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజేశ్ చంద్ర మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, మహ్మద్ యూనుస్ అలీ, దివంగత్ ఏఎస్ఐ కుమారుడు జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.