
వినాయక ప్రతిమల ప్రతిష్ఠాపనకు అనుమతి తప్పనిసరి
నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్
నిర్మల్ అర్బన్, ఆగస్టు 23 : జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మండపాల నిర్వాహకులకు నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిమల ప్రతిష్ఠాపన మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకొని ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు ముగించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏ ప్రాంతవాసులైనా ప్రతిమల ప్రతిష్ఠాపనకు సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రదేశాల్లో గానీ, రోడ్లపై గానీ, వివాదాస్పద ప్రదేశాల్లో గానీ ప్రతిమల ప్రతిష్ఠించవద్దన్నారు. అలాగే మండపాల వద్ద విద్యుత్ వినియోగానికి తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాలు పూర్తయ్యే దాకా మండపాల వద్ద తగినంత సంఖ్యలో వలంటీర్లను నియమించి, 24 గంటలు పర్యవేక్షించాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసులకు వివరించాలన్నారు.
పోలీసులకు శిక్షణ ముగింపు..
ఇంటిగ్రేటెడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ప్రాజెక్టుపై పోలీసులకు నిర్వహించిన శిక్షణ ముగిసిందని ఇన్చార్జి ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ఆ యా పోలీస్స్టేషన్లలో శిక్షణకు సంబంధించిన వివరాలను టెక్నికల్ సిబ్బందితో పరిశీలించారు. కేం ద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు.