
బోథ్ ఎమ్మెల్యే బాపురావు
పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంప్‌యార్డు ప్రారంభం
బజార్హత్నూర్, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని మంజారంతండాలో నూతనంగా నిర్మించిన ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్‌యార్డును సోమవారం ఎంపీపీ అజిడే జయశ్రీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు కొత్త రూపురేఖలు సంతరించుకుంటున్నాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు స్వరాష్ట్రంలో అన్ని రకాల హంగులతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని తెలిపారు. అనంతరం వైకుంఠధామంలో మొక్క నాటి, నీరు పోశారు. ఆ తర్వాత ప్రకృతి వనంలో మొక్కలను పరిశీలించి, సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, ఎంపీడీవో దుర్గం శంకర్, ఎంపీవో మహేందర్, బోథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ రాజారాం, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు..
బోథ్, ఆగస్టు 23 : ఆదిలాబాద్‌లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, వందన దంపతులు పూజలు చేశారు. శివాలయంలో లింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు.