
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ట్రైన్లో వెళ్తుండగా అస్వస్థత
చైన్‌లాగి మంచిర్యాలలోని శ్రీ మహాలక్ష్మి దవాఖానకు తరలింపు
అత్యవసర వైద్యమందించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ కుమార్‌వర్మ
జీవితాంతం రుణపడి ఉంటామన్న బేబి తండ్రి మహ్మద్ రఫీక్
హాజీపూర్(మంచిర్యాల ఏసీసీ), జనవరి 23 : ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రైలులో వెళ్తున్న ఓ పసిపాప మంచిర్యాలకు చేరుకోగానే అస్వస్థతతకు గురైంది. కుటుంబ సభ్యులు ట్రైన్ చైన్‌లాగి మంచిర్యాలలోని శ్రీ మహాలక్ష్మి దవాఖానకు తరలించగా వైద్యులు మెరుగైన చికిత్స అందించి ఊపిరి పోశారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ రఫీక్ కుటుంబం వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 7న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరాడు. నాగపూర్‌కు చేరుకోగానే రఫీక్ బిడ్డ హబీబా (3 నెలలు ) అస్వస్థకు గురైంది. బెల్లంపల్లి వరకు వచ్చే సరికి పాపలో చలనం లేకుండా పోయింది. 8వ తేదీన మధ్యాహ్నం మంచిర్యాల రైల్యే స్టేషన్‌కు చేరుకోగానే చైన్ లాగి రైలును ఆపారు. ఆ వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వారు పాప పరిస్థితిని గమనించి శ్రీ మహాలక్ష్మి పిల్లల దవాఖానకు రెఫర్ చేశారు. డాక్టర్ కుమార్ వర్మ పాపకు శ్యాస అందకపోవడం, గుండె వేగం పడిపోవడాన్ని పరిశీలించారు. ఆ వెంటనే గొంతులో ట్యూబ్ వేసి సెకండ్ల వ్యవధిలో వెంటిలేటర్‌ను అమర్చి వైద్యం అందించారు. అయినా పాప పరిస్థితి మెరుగు పడక పోవడంతో పాపకి ఏజీబీ పరీక్షలు నిర్వహించారు. శరీరానికి అవసరమైన బైకార్బోనెట్ రసాయనం లేనట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. బీపీతో పాటు గుండె కొట్టుకునే వేగాన్ని సాధారణ స్థాయికి తీసుకరావడానికి చిన్న పిల్లల వైద్యంలో అరుదుగా ఉపయోగించే ఔషధాన్ని ఉపయోగించారు. అనంతరం వైద్యుడు కుమార్‌వర్మ మాట్లాడుతూ వెంటి లేటర్ సహాయంతో పాపను కాపాడడం సంతోషంగా ఉందన్నారు. ప్రాథమిక రిపోర్ట్‌లో ఆ పాప ”సిస్టిక్ పైబ్రోసిస్” అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నదన్నారు. పాప పూర్తిగా కోలుకోగా, ఆదివారం డిచ్చార్జి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాప తండ్రి మహ్మద్ రఫీక్ మాట్లాడుతూ చనిపోయిందనుకున్న తమ బిడ్డని కాపాడిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.