
అద్దె గది నుంచి అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలింపు
‘నమస్తే’ కథనానికి స్పందన
పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ శిరీష్
ఎదులాపురం, నవంబర్ 22 : పక్షవాతంతో ఉన్న ఆర్తికి, రక్తహీనతతో బాధపడుతున్న తన కూతురు రేణుకకు రిమ్స్‌లో వైద్యం అందిస్తున్నారు. ‘ఆమె ఆర్తి తీర్చెదెవరు’ అని ‘నమస్తే’లో వచ్చిన కథనానికి రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష్ స్పందించారు. ఈ మేరకు ఆర్తి, తన కూతరిని వారు ఉంటున్న అద్దె గది నుంచి సోమవారం అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. పాపకు న్యూట్రిషన్, రక్తహీనత తదతర పరీక్షలు చేశారు. మూడుళ్ల రేణుక కడుపు పెద్దగా ఉండడం గమనించి పరీక్షలు చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు, ఆ మేరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక భర్త చిత్రహింసలతో పక్షవాతం వచ్చి ఎడమ కాలు, చేయి పనిచేయకుండా ఉన్న ఆర్తికి కూడా చికిత్స చేస్తున్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఆదివారం సరకులు అందజేయగా, నెలకు రూ.2 వేల భత్యం అందేలా ప్రక్రియ మొదలుపెట్టారు.