
నిర్మల్ టౌన్, అక్టోబర్ 22: నిర్మల్ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని వర్గాల వారికి రుణ ప్రణాళికను అమలు చేసేలా బ్యాంకర్లు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం లీడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూఎస్బీ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాలకు మంజూరైన రుణాలను అందించారు. జిల్లాలోని 14 మహిళా సంఘాలకు రూ.29 కోట్ల 76లక్షల 55వేల రుణాలను అందించగా.. మెప్మా కింద 69 సంఘాలకు రూ. 4 కోట్ల 59 లక్షలు, స్వయం సహాయక సంఘాలకు రూ. 25 కోట్ల 17 లక్షల 55 వేల రుణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారులు, మహిళా సంఘాలు, నిరుద్యోగ యువత, పారిశ్రామిక రంగానికి రుణాలను అందించాలని నిర్ణయించిందని తెలిపారు. అన్ని బ్యాంకులు లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎన్ని రుణాలైనా బ్యాంకుల ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లీడ్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ పేర్కొన్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనారా బ్యాంక్, సిటీ బ్యాంక్, ఇండియా బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు సిబ్బంది తమ శాఖల రుణ ప్రణాళికను కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ డీజీఎం మోహన్‌దాస్, బ్యాంకు సిబ్బంది సురేందర్, కృష్ణ, మురళీధర్‌రెడ్డి, సుభాష్, డీఆర్డీవో రమేశ్, ఏపీడీ గోవింద్రావు తదితరులు పాల్గొన్నారు.