
నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్
పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 22 : మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపి, నిర్మల్‌ను గంజాయి, గుడుంబా, గుట్కా రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరించాలని, దర్యాప్తులో ఉన్న కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు వ్యసనాలకు పాల్పడి అనారోగ్య బారిన పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు, పంట పొలాలు, ఇండ్లలో గంజాయి మొక్కలు దొరికితే సంబంధీకులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని సూచించారు. గంజాయిని అరికట్టడంలో కృషి చేసిన పోలీస్ అధికారులకు ప్రత్యేక రివార్డ్‌ను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా గంజాయి రహిత పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధులమై ఉంటామని పోలీస్ సిబ్బందితో ప్రమాణం చేయించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, డీఎస్పీ జీవన్‌రెడ్డి సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.