
రేపటి నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం
4.84లక్షల గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ
32 ప్రత్యేక బృందాలు ఏర్పాటు
నిర్మల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మేకలు, గొ ర్రెలను ముసర వ్యాధి(పారుడు) నుంచి కాపాడేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పీపీఆర్ వ్యాక్సినేషన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలోని 19 మండలాల్లో నిర్వహించేందుకు 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక డాక్టర్‌తో పాటు పారాస్టాఫ్ను నియమించారు. ఈసారి 66శాతం మేకలు, గొర్రెలను లక్ష్యంగా పె ట్టుకున్నారు. నిర్మల్ జిల్లాలో 2020 లైవ్ స్టాక్ సెన్సెన్ ప్రకారం మొ త్తం 3,84,296 గొర్రెలు, 99, 874 మేకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటన్నింటికీ 15 రోజుల పాటు సంబంధిత బృందాలు వ్యాక్సినేషన్ చేపట్టనున్నాయి. ఏటా ముసర వ్యాధి కారణంగా గొ ర్రెలు, మేకలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్న కారణంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఒకసారి వ్యాక్సినేషన్ తీసుకున్న మేక, గొర్రెకు దాని ప్రభావం జీవిత కాలం పని చేస్తుందని సం బంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం… 3, 19,652 టీకాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన బృందాలకు శిక్షణ కూడా పూర్తయింది.
ముసర వ్యాధితో మేకలు, గొర్రెలకు ప్రాణహాని…
ముసర వ్యాధి(పారుడు) కారణంగా గొర్రెలు, మేకలకు ప్రాణహా ని పొంచి ఉంటుందని పశువైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యా ధి వైరస్ రూపంలో వీటికి సోకుతుందని, దీంత వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి విరేచనాలు, తీవ్రజ్వరం, బలహీన పడిపోవడం లాంటివి సంభవిస్తాయంటున్నారు. కాగా ఒక గొర్రెకు గాని మేకకు గాని ఈ ముసరవ్యాధి సోకితే ఆ మందలోని మిగతా వాటన్నింటికీ సోకే ప్రమాదం ఉంటుందని, కేవలం ఒకటి రెండు రోజుల్లోనే వ్యాధి తీవ్ర త కారణంగా మరణించే అవకాశం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
32 బృందాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,84,120 గొర్రెలు, మేకలకు గాను 3 లక్షల 19వేల 652 టీకాలు వేసేందుకు కార్యాచరణను రూపొందిచారు. ఇందుకోసం మొత్తం 19 మండలాలకు గాను 32 బృందాల ను నియమించారు. ఈ బృందాలకు ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో శిక్షణను కూడా పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 15 రోజుల పాటు గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను షెడ్యూ ల్ ప్రకారం నిర్వహించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మేకలు, గొర్రెల్లో ముసర వ్యాధిని నివారించేందుకు ఈ నెల 24 నుంచి 15 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గొర్రెలు, మేకల పెంపకందారులు ఈ వ్యాక్సినేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే గ్రామపంచాయితీల వారిగా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాం.
-డా. రమేశ్‌కుమార్, జిల్లా పశు వైద్య శాఖ అధికారి