
నార్నూర్, జనవరి 22 : పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, మల్టీపర్పస్ కూలీలు వచ్చిన తర్వాత కార్మికులు నిత్యం వీధుల్లోకి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మొదలైంది. ఈ పనులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజు వారి, పల్లె ప్రగతి పనులు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి పేరిట ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. నిత్యం గ్రామాల్లో చేపడుతున్న పనుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు యాప్‌లో నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి, రోజు, నెల వారి కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి పీఎస్ యాప్ అభివృద్ధి చేశారు. పంచాయతీ కార్యదర్శి రోజు వారి కార్యకలపాలను పర్యవేక్షించడానికి ఇన్ఫెక్షన్ అధికారి నమోదు చేసేలా చేశారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి కార్యదర్శి యాప్‌లో నమోదు చేసే పనులు, పర్యవేక్షణ అధికారి పనులను ఎప్పటికప్పుడు నమోదు చేసున్నారు.
అధికారుల భాగస్వామ్యం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్‌లో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులను భాగస్వామ్యం చేసింది. పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారి, డీఎల్పీవో, బీఎల్పీవోలను భాగస్వామ్యం చేసింది.
నమోదు చేసే వివరాలు
గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రతి రోజూ కార్యదర్శులు ఏ పని చేయాలో ఫోన్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఇందులో పనుల వివరాలు. ఫొటోలను తీసి నమోదు చేస్తున్నారు. పల్లెప్రగతి పనులు, వాటర్ ట్యాంక్ శుభ్రత, పంచాయతీ పాలన, నివేదిక నిర్వహణ, ధ్రువీకరణ పత్రాల ఆమోదం, ఖర్చులు, చెక్కులు ఇవ్వడం, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఉపాధి పనుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం..
గ్రామంలో నిత్యం చేపడుతున్న పనులు, పారిశుధ్య సంబంధిత వివరాలు రోజు వారీగా నమోదు చేస్తున్నాం. పనుల తర్వాత ఫొటో తీసి పంపిస్తున్నాం.
–లవ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి, మాన్కాపూర్