
యువకుడి హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు
ఇద్దరు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ
ఎదులాపురం, జనవరి22: ద్విచక్రవాహనం తాకట్టుపెట్టి అవసరానికి డబ్బు తీసుకుందామనుకున్న ఆ యువకుడు మోసగాళ్ల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. ఈ నెల ఒకటో తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసు మిస్టరీ దారుణహత్యగా తేలింది. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల ఒకటో తేదీన జైనథ్ మండల కేంద్రంలోని తర్నం గ్రామం మీదుగా వెళ్లే భోరజ్ చంద్రపూర్ రహదారిలో పక్కన ముళ్లపొదల్లో యువకుడు హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని ముళ్లపొదల్లోకప్పిపెట్టారు. ఈ నెల 4న గుర్తుతెలియని మృతదేహం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఛేదించానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, జైనథ్ సీఐ మలేశ్, సీసీఎస్ సీఐ చంద్రమౌళి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మృతుడి వద్ద ఫోన్ లేదు.అలాగే హంతకుల వద్ద కూడా ఫోన్ లేదు. అయినా ఈ కిష్టమైన కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఆదిలాబాద్‌లోని పుత్లీబౌలికి చెందిన ఇందూరు గజానన్ ( 36)గా గుర్తించారు. తరువాత హంతకులను పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం , స్థానికంగా సేకరించిన సాక్షాధారాలతో దర్యాప్తు వేగం చేశారు. నిందితులు బంగారిగూడకు చెందిన షేక్ అస్లాం, కోకటి విజయ్ గా గుర్తించారు.
నిందితులు పోలీసులకు వెల్లడించిన వివరాల ప్రకారం .. ఇందూర్ గజానన్ ఈ నెల ఒకటో తేదీన ద్విచక్ర వాహనం తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులు గమనించి డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి చీకటి పడేవరకు ఆగాలని సూచించారు. అదే వాహనంపై ముగ్గురు ఆదిలాబాద్ పట్టణంలోని పలు చోట్ల తిప్పుతూ చివరికి తర్నం గ్రామం మీదుగా వెళ్లి భోరజ్ రోడ్డు వైపు తీసుకెళ్లారు. అనంతరం గజానన్ గొంతుకోసి హత్య చేశారు. శవాన్ని రోడ్డుపక్కన కనపడకుండా పడేశారు. నిందితుల కోసం గాలిస్తుండగా ఈ నెల21న సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో నిందితులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను విచారించగా గజానన్ వద్ద ఉన్న వాహనాన్ని దొంగించాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. పటిష్టమైన సాక్షాధారలు, సాంకేతిక పరిజ్ఞానం జోడించి కేసు దర్యాప్తు పూర్తిచేసి ఇరువురు నిందితులను న్యాయంస్థానంలో ప్రవేశపెడతామన్నారు. కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలోని పోలీసులను ఎస్పీ అభినందించారు. త్వరలో రివార్డులు అందజేస్తామన్నారు. చాందా( టీ) మైనారిటీ గురుకుల పాఠశాల వద్దగల కింది గదులలో తనిఖీ చేయగా రూ.11,17,800 నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు సాజిద్ఉల్లాఖాన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ పురుషోత్తమాచారి, ఎస్ఐ హరిబాబు ఉన్నారు.