
ఆదిలాబాద్ జిల్లాలో 65 శాతం నల్లరేగడి భూములు
డిమాండ్ ఉన్న పంటలతోనే లాభాలెక్కువ
పత్తిసాగులో పింక్బౌల్ నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
రైతులకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ డయాగ్నోస్టిక్ టీమ్లు
ఆదిలాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆదిలాబాద్ జిల్లాలో 65 శాతం నల్లరేగడి నేలలు, 35 శాతం ఎర్ర చెల్క, దుబ్బు, చౌడు, ఇసుక భూములున్నాయని, ఇవి అన్ని పంటలకూ అనుకూలమని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అన్నారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలతోనే లాభాలెక్కువగా వస్తాయని పేర్కొన్నారు. మన నేలల్లో వర్షపు నీటిని నిలుపుకునే శక్తి ఉందని, అందువల్లే రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, శనగ వేస్తారని తెలిపారు. పత్తిలో పింక్బౌల్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని సూచించారు. యాసంగి విషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ఐదు వ్యవసాయ డివిజన్లలో ఫీల్డ్ డయాగ్నోస్టిక్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి నేలలు ఉన్నాయి.? ఎలాంటి పంటలు పండిస్తారు.
శ్రీధర్ చౌహాన్ : ఆదిలాబాద్ జిల్లాలో 65 శాతం మధ్య నల్లరేగడి భూములు, 35 శాతం ఎర్ర చెల్కలు, దుబ్బ భూములు, చౌడు, ఇసుక నేలలు ఉన్నాయి. నల్లరేగడి నేలల్లో వర్షపు నీటిని నిలుపుకునే గుణం ఉండడంతో రైతులు ఎక్కువగా వర్షాధార పంటలు సాగుచేస్తారు. వానకాలంలో పత్తి, సోయా, కంది పంటలు, యాసంగిలో శనగ, జొన్న, గోధుమ పండిస్తారు. జిల్లాలో 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరు విత్తనాల లభ్యత, బ్యాంక్ రుణాలు, పంటల కొనుగోళ్ల లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పంటలు పండిస్తారు.
నమస్తే : రైతులు ఏ పంటలు సాగు చేస్తే లాభాలు పొందవచ్చు?
శ్రీధర్ చౌహాన్ : ఈ ఏడాది పత్తికి మంచి ధ ర ఉంది. రైతులకు లాభాలు వస్తున్నాయి. సో యా, కంది పంటలకు సైతం బాగా డిమాండ్ ఉంది. ఉట్నూర్, ఇచ్చోడ మండలాల్లో 3 వేల ఎకరాల వరకు యాసంగిలో రైతులు వరిని సాగు చేస్తారు. వారి అవసరాల మేరకు ఈ పంట సరిపోతుంది. రెండో పంటగా శనగను ఎక్కువ సాగు చేస్తారు. దీంతో పాటు జొన్న, గోధుమ, మక్క, ఆవాలు, కుసుమ పండిస్తే ప్రయోజనం ఉంటుంది. శనగ పంటలో మొలక, మధ్య దశలో ఎండు తెగులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రైతులు విత్తనశుద్ధి చేస్తే ఈ సమస్య అధిగమించవచ్చు. ట్రై కోడర్మవిలిడే అనే జీవశీలింద్రారం కిలో విత్తనానికి 7 నుంచి 8 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేయాలి. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆధ్వర్యంలో నడిచే బయోకంట్రోల్ రూంలలో ఇవి కిలో రూ.100 చొప్పున దొరుకుతాయి.
నమస్తే : వానకాలంలో రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. ఈ పంట సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
శ్రీధర్ చౌహాన్ : జిల్లాలో నల్లరేగడి భూములు పత్తిసాగుకు అనుకూలం. జూన్ మొదటి పదిహేను రోజుల్లో వేసిన పంటను రెండు ఏరివేతల తర్వాత డిసెంబర్ 15 వరకు తొలగించాలి. దీనికి ప్రధాన సమస్య పింక్బౌల్. ఈ పురుగు 3 నుంచి 4 నెలల పాటు నిద్రావస్థ దశలో ఉంటుంది. పంట కాలపరిమితిని పొడిగిస్తే పింక్బౌల్ ప్రమాదం ఉంటుంది. పంట తీసిన తర్వాత పత్తి కట్టెలతో ఎరువులను తయారు చేసుకోవాలి. కాటన్ చిప్ షెడ్డర్తో కత్తిరించి భూమిలో గుంతలు చేసి వేయాలి. ఆవు పేడ, మూత్రం చల్లి మురిగిన తర్వాత భూముల్లో చల్లితే గులాబీ పురుగు నివారణతో పాటు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. పంటకు అన్ని వైపులా నాలుగు వరుసలు నాన్బీటీ విత్తనాలు వేస్తే పింక్బౌల్ నుంచి రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం పత్తికి ధర ఎక్కువగా ఉండడంతో రైతులు పంటను పొడిగించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లోగా పంట తీసివేయాలి.