నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: మమ్ముట్టి (అతిథి పాత్ర), అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ షౌకత్, విశాక్ నాయర్, సిద్ధిక్, లక్ష్మీ మీనన్ తదితరులు
దర్శకత్వం : అధ్వైత్ నాయర్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్.. అదే (డబ్ల్యూడబ్ల్యూఈ)కి 90లలో యమ క్రేజ్ ఉండేది. ఈ ఆట అంటే నాటితరం చెవికోసుకునేది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ.. మలయాళంలో ‘చథా పచ్చ’ సినిమా తెరకెక్కింది. కుస్తీ పోటీల నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా.. గత జనవరిలో థియేటర్లలో సందడి చేసింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగులోనూ మంచి ఫ్యూస్ కొల్లగొడుతూ.. హిట్ టాక్ తెచ్చుకున్నది.
ఇక రింగ్‌లోకి ఎంటరైతే.. సావియో (అర్జున్ అశోకన్), వెట్రి (రోషన్ మాథ్యూ), లిటిల్ (ఇషాన్ షౌకత్) అన్నదమ్ములు. ఈ ముగ్గురికీ చిన్నప్పటి నుంచి ‘కుస్తీ’ పోటీలంటే అమితాసక్తి. ఆ ఊర్లో జరిగే కుస్తీ పోటీలలో ‘మాని’కి ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటి ఆటగాడిని ఎక్కడి నుంచో వచ్చిన వాల్టర్ (మమ్ముట్టి) ఓడిస్తాడు. అప్పటి నుంచి అతణ్ని హీరోగా భావిస్తూ.. ఈ ముగ్గురు అన్నదమ్ములు వాల్టర్ దగ్గరే కుస్తీలో శిక్షణ పొందుతారు. కొన్నిరోజులకు లిటిల్ను తీసుకొని తన తల్లి వేరే ఊరికి మకాం మారుస్తుంది. దాంతో ముగ్గురి దారులూ వేరైపోతాయి. పెద్దయ్యాక.. ఇద్దరు అన్నలను వెతుక్కుంటూ సొంతూరికి చేరుకుంటాడు లిటిల్.
పెద్దన్న సావియో.. ఆర్థిక కష్టాల్లో ఉంటాడు. లాంచ్‌పై పనిచేస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు. ఇక రెండోవాడు వెట్రి ఏడెనిమిదేళ్లుగా జైల్లోనే ఉన్నాడన్న సంగతిని జీర్ణించుకోలేక పోతాడు. వెట్రికి జాస్మిన్‌తో పెళ్లయ్యిందనీ, సావియో దగ్గర పెరుగుతున్న రోసా.. వెట్రి కూతురని తెలుసుకుంటాడు లిటిల్. మరోవైపు ఆ ఊళ్లో రాజకీయంగా శివన్ చక్రం తిప్పుతూ ఉంటే.. ‘కుస్తీ’లో తనదే పైచేయి అని చెరియన్ నిరూపించుకుంటూ ఉంటాడు.
ఈ క్రమంలో ఊళ్లో మళ్లీ ‘కుస్తీ’ని మొదలుపెట్టి.. తమ చిన్ననాటి కలను నెరవేర్చుకోవడంతోపాటు తామేంటో నిరూపించాలని లిటిల్ నిర్ణయించుకుంటాడు. అతనికి సావియో మద్దతు ఇస్తాడు. కానీ, దానికోసం వెట్రిని జైలు నుంచి విడిపించాలంటే భయపడతాడు. అందుకు కారణం ఏమిటి? వెట్రి జైలుకు ఎందుకు వెళ్లాడు? ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గతంలో ఏం జరిగింది? వెట్రి జైలు నుంచి బయటికి వస్తాడా? చెరియన్ను ఈ అన్నదమ్ములు ఎలా ఎదుర్కొంటారు? వారి ఆశయం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.