
353బీ పేరిట మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణం
ఉన్నతాధికారులకు వివరాలు అందజేత
ఇరురాష్ర్టాలకు మెరుగుపడనున్న రవాణా
వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సులువు
భూ సేకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం
ఆదిలాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో మరో జాతీయ రహదారి పనులు ప్రారంభించే అవకాశమున్నది. జిల్లాలో ఇప్పటికే నేరడిగొండ నుంచి జైనథ్ మండలం డొల్లార వరకు 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి(ఎన్హెచ్-44) ఉంది. నూతనంగా జైనథ్ మండలం భోరజ్ నుంచి బేల మండలం మహారాష్ట్ర సరిహద్దు ఉపసనాల వరకు 32.5 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నివేదికలను ఆర్అండ్బీ శాఖకు అందించింది. ఇది అందుబాటులోకి వస్తే తెలంగాణ-మహారాష్ట్రకు రవాణాతో పాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మరింత మెరుగుపడనున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల జాతీయ రహదారి నంబర్ 44 ఉంది. నేరడిగొండ నుంచి జైనథ్ మండలం డొల్లార వరకున్న ఈ నేషనల్ హైవేపై రోజూ వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. ఉత్తరాది రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో పాటు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రజలు దక్షిణాది రాష్ర్టాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటకకు రాకపోకలు సాగిస్తుంటారు. నాలుగు వరుసల ఈ రహదారి వాహనాల రాకపోకలకు ఎంతగానో సులువుగా ఉన్నది. ఈ రహదారికి ఇరువైపులా సమీప గ్రామాల ప్రజలు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కృషి ఫలితంగా హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై పారిశ్రామిక కారిడార్ సైతం మంజూరైంది. దీంతో ఈ రోడ్డుపై వివిధ పరిశ్రమలు సైతం ఏర్పాటు కానున్నాయి.
మరో ఎన్హెచ్ నిర్మాణానికి కసరత్తు..
ప్రస్తుతం ఉన్న నేషనల్హైవేతో పాటు జిల్లాలో మరో జాతీయ రహదారి నిర్మాణానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. జైనథ్ మండలం భోరజ్ నుంచి బేల మండలం మహారాష్ట్ర సరిహద్దు ఉపసనాల వరకు 32.5 కిలోమీటర్ల మేర 353బీ పేరుతో జిల్లాలో మరో జాతీయ రహదారి నిర్మాణం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ సిక్తా పట్నాయక్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. రహదారికి అవసరమైన 37 హెక్టార్ల భూ సేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమగ్ర వివరాలతో సమాచారం ఇవ్వాలని తెలిపారు. విద్యుత్, మిషన్ భగీరథ, ఇతర శాఖల నుంచి సైతం సమాచారం తీసుకోవచ్చన్నారు. విద్యుత్, మిషన్ భగీరథ శాఖల అధికారులు ప్రస్తుతం ఉన్న రోడ్డు పక్కన ఉన్న కరంట్ స్తంభాలు, మిషన్ భగీరథ పైపులను తరలించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
అధికారులకు వివరాలు..
ప్రస్తుతం ఉన్న రోడ్డుకు సంబంధించిన వివరాలను ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నతాధికారులకు అందజేశారు. నివేదికలతో పాటు రోడ్డుపై ట్రాఫిక్, ఇతర అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకొని డీపీఆర్ తయారు చేస్తారు. ఈ నివేదికల ఆధారంగా జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పాటు పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా రెవెన్యూ అధికారులు 37 హెక్టార్ల భూ సేకరణ త్వరలో చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి జైనథ్, బేల మీదుగా రెండు వరుసల రహదారి ఉంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా నుంచి ఈ రోడ్డు గుండా ఇరు రాష్ర్టాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. తెలంగాణ వైపు నుంచి 32.5 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 83 కిలోమీటర్ల మేర 323బీ జాతీయ రహదారి నిర్మాణం కానుండడంతో ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది. జైనథ్, బేల మండలాల్లోని రోడ్డు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు వ్యాపారాలు సైతం పెట్టుకొని తమ ఉపాధిని మెరుగుపర్చుకోవచ్చు.
అధికారులకు అందజేశాం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్య లు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న రహదారికి సంబంధించిన పూర్తి వివరాలను రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులకు అందజేస్తాం. ఇప్పటికే ఉన్న రోడ్డు, వంతెనలు, ఇతర వివరాలను నివేదికల రూపంలో ఉన్నతాధికారులకు ఇస్తాం. వీటి ఆధారంగా వారు తదుపరి చర్యలు తీసుకుంటారు.