
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్
భారత్కి ఆజాది కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం
పాల్గొన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్, బోథ్ ఎమ్మెల్యే బాపురావ్
ఎదులాపురం, ఆగస్టు 21 : మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ‘భారత్ కి ఆజాది కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో గ్రామీణ రోడ్లపై సెమినార్ నిర్వహించారు. ముందుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అంతర్గత రోడ్లు కలవడం ద్వారా రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారని తెలిపారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ‘భారత్కి ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణం, నాణ్యత, రవాణా సౌకర్యాలు వంటి అంశాలపై సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
వివిధ పథకాలతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులు చేపట్టి నిధులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ… స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సాంకేతిక సందేశాన్ని అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ కుమార్ మొలుగారం మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంతో గమ్యానికి సురక్షితంగా చేరుకుంటామని తెలిపారు. స్థానిక వనరులు, లభ్యత అధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లను నిర్మించాలని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ ఎస్ఈ వెంకట్రావు, ఈఈ మహవీర్, డీపీవో శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.