
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర
వన్‌టౌన్ స్టేషన్ సందర్శన
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని సూచన
ఎదులాపురం, ఆగస్టు 21 : ప్రజలకు పోలీసులు ఆదర్శవంతంగా సేవలు అందించి శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. పట్టణంలోని వన్‌టౌన్ స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. ముందుగా ఎస్పీకి డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ ఎస్ రామకృష్ణ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పట్టణ ఎస్ఐ జీ అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వివరాలను సీఐని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు అనంతరం తప్పించుకొని తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని సూచించారు. రిసెష్షన్ కౌంటర్‌ను సందర్శించి, ఫిర్యాదు స్వీకరించిన అనంతరం నమోదు చేసిన రిసెష్షన్ డైరీని పరిశీలించారు. పోలీస్ అధికారులతో కలిసి పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ.. యూనిఫాం సర్వీస్ డెలివరీలో భాగంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి ఎల్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వర్టికల్ విభాగంలో పోలీసుల సేవలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ఆయా విభాగాలకు చెందిన పోలీసుల కు సాంకేతిక పరిజ్ఞానం మరింత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పట్టణంలో గుట్కా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్కా నిర్వాహకులపై మరింత నిఘా పెంచి కట్టడి చేయడానికి అదనంగా మరో వాహనాన్ని సమకూర్చినట్లు తెలిపారు. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమ త్తం చేయాలని సూచించా రు. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేయడానికి నూతన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తక్కువ ధరలకే వాహనాలు, వస్తువులు అని మోసం చేయ డం, వారి మాటలు నమ్మి మోసపోయిన అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు కాజేయడం తరచూ జరుగుతున్న నేరాలని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గోడ పత్రాలు, కరపత్రాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పోలీస్ కళాజాత బృందంతో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ ఎస్ రామకృష్ణ, శిక్షణ ఎస్ఐ బాల్తా స్నేహ, ఎస్ఐ జీ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.