మద్దతు ధర కంటే అధికం
ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం
పంట మార్పిడితో పెరిగిన మక్క సాగు
దక్షిణాది రాష్ర్టాల్లో అతివృష్టితో తగ్గిన దిగుబడి
మన మక్కజొన్నకు మంచి డిమాండ్
హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
నిర్మల్ టౌన్, మార్చి 14 : ‘రైతాంగానికి లాభం చేకూరాలంటే విభిన్న పంటలు వేయాలి. రైతుల దృక్పథంలో మార్పు రావాలి. అటువంటప్పుడే మద్దతు ధర, అంతకంటే అధిక ధర లభిస్తుంది.’ అని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వెల్లడించారు. సీఎం చెప్పిన విధంగానే రైతులు పంట విధానంలో మార్పు చేశారు. దీనికి నిదర్శనం కొన్నిచోట్ల వరి తగ్గి, మక్కజొన్న పెరగడమే. ప్రస్తుతం రైతులకు మక్క సిరులు కురిపిస్తున్నది. మద్దతు కంటే ధర అధికంగా పలుకుతున్నది. ఇతర రాష్ర్టాల్లో అతివృష్టితో దిగుబడి తగ్గడం, మన రాష్ట్రంలో దిగుబడి పెరగడంతో రైతన్నలకు కలిసివచ్చింది. ఇప్పటికే క్వింటాలుకు రూ.2100 పలుకుతుండగా.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో లక్ష ఎకరాల్లో మక్కజొన్న సాగైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో నిర్మల్ జిల్లాలో 50 వేల ఎకరాలు, ఆదిలాబాద్లో 25 వేలు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 10 వేలు, మంచిర్యాల జిల్లాలో 15 వేల ఎకరాలు సాగు చేశారు. వానకాలంలో సోయ, పత్తి సాగు చేయగా.. రెండో పంటగా మక్క వేశారు. దీనికితోడు పొలాల్లో కూడా మక్క సాగు చేయడంతో ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. మార్కెట్లో కూడా మంచి ధర పలుకడంతో కష్టాలు దూరమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలు మక్కకు మద్దతు ధర రూ.1,870 ప్రకటించగా.. అంతకు మించి రూ.300 అదనంగా పలుకుతున్నది. గతేడాది యాసంగిలో ప్రభుత్వ కొనుగోళ్లు లేక దళారులు నాణ్యతను బట్టి క్వింటాలుకు రూ.1,400-రూ.1,550 ధర పెట్టారు. ఈసారి గతేడాది కంటే రూ.600 అదనంగా లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మన మక్కకే డిమాండ్..
బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో వానకాలంలో అధికంగా మక్కజొన్న సాగు చేస్తారు. ఈ రాష్ర్టాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం, వ రదలతో పంట కోతకు గురికావడంతో ఆశించిన స్థా యిలో దిగుబడి రాలేదు. రెండేళ్లుగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కోళ్లకు దాణాగా ఉపయోగించే మక్కలు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో డిమాండ్ తగ్గింది. ఆహార వస్తువుల్లో ఉపయోగించే మ క్కకు డిమాండ్ తగ్గడంతో మన వద్ద పండించిన మక్కపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ఈసారి రికార్డుస్థాయిలో ధర పలుకగా.. రాబోయే రోజుల్లో మరో రూ.500 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యా పార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాల్లో మక్క సాగు చేస్తుండగా.. ఎకరానికి 35-40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురియడంతో దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది.
30 ఏండ్లుగా ఇంత ధర చూడలేదు..
వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడంతో మక్క సాగు చేశా. గతేడాది వరితోపాటు మక్క సాగు చేస్తే మార్కెట్లో మద్దతు ధర రూ.1,870 ఉండగా.. దళారులకు రూ.14 00-రూ.15 00లకే అ మ్ముకున్నాం. తక్కువ వ్యవ ధి, తక్కు వ పెట్టుబడితో ఎక్కు వ దిగుబడి ఇచ్చే పంట కావడంతో ఈసారి కూడా మక్క వేసినా. మార్కెట్లో ప్రస్తుతం దళారులే క్వింటాలుకు రూ. 2,100 చెల్లిస్తుండంతో సంతోషంగా ఉంది. 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇంత ధర ఎప్పుడు పలకలేదు.
– నాగనాథ్, వడ్తాల్, ముథోల్ మండలం
మద్దతు ధర కంటే మించి కొంటున్నాం..
ప్రస్తుతం మక్కను మద్దతు ధర మించి కొనుగోలు చేస్తు న్నాం. గతేడాది ప్రభు త్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతుల వద్ద క్వింటాలుకు రూ.1400 నుంచి రూ.1600 వరకు మాత్రమే కొనుగోలు చేసినం. ఈసారి ప్రారంభంలోనే రూ.2,100 ధర పలుకుతున్నది. ఇప్పటికే చాలా మంది రైతులు ధర చూసి చాలా సంతోషపడుతున్నారు.
– ఎగ్గం నర్సింహులు, దళారి, ఓలా