e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home ఆదిలాబాద్ వీరుడా వందనం

వీరుడా వందనం

  • నివాళులర్పించిన మంత్రి అల్లోల, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో, కలెక్టర్‌
  • సంస్కృతీ సంప్రదాయాల నడుమ పూజలు చేసిన భీం మనుమడు సోనేరావ్‌
  • వేలాదిగా తరలివచ్చిన అడవిబిడ్డలు.. పులకించిన పోరుగడ్డ
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • ఆకట్టుకున్న స్టాళ్లు..
  • కుమ్రం సూరు విగ్రహావిష్కరణ
  • యోధుడి ఆశయాలను నెరవేరుస్తున్న ప్రభుత్వం : మంత్రి
  • జోడెఘాట్‌లో అధికారికంగా కుమ్రం భీం వర్ధంతి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, అక్టోబర్‌ 20;అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందిన కుమ్రం భీంను యావత్‌ ప్రజానీకం స్మరించుకున్నది. బుధవారం జోడెఘాట్‌లో కుమ్రం భీం, కుమ్రం సూరు వర్ధంతిని అధికారికంగా నిర్వహించగా, పోరుగడ్డ పులకించింది. అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, ఎంపీ సోయం బాపురావ్‌, ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తదితరులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. భీం మనుమడు సోనేరావు తన కుటుంబ సభ్యులు, ఆదివాసులతో కలిసి సంస్కృతీ సంప్రదాయాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణతో పాటు పక్క రాష్ర్టాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలిరాగా, ఆ ప్రాంతం జాతరను తలపించింది. గోండు పాటలపై చేసిన నృత్యాలు అలరించగా, పలు శాఖల స్టాళ్లు ఆకట్టుకున్నాయి.

అడవితల్లి ముద్దుబిడ్డ, ఆరాధ్యదైవం కుమ్రం భీంకు ఆదివాసులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం జోడెఘాట్‌లో భీం 81వ వర్ధంతిని నిర్వహించగా, జిల్లా నలుమూలల నుంచేగాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు వస్తూనే కనిపించారు. సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీగా వచ్చిన ఆదివాసుల పోరు నినాదాలతో జోడెఘాట్‌ ప్రాంతం హోరెత్తింది. భీం మనుమడు సోనేరావ్‌ పూజా కార్యక్రమం ప్రారంభించారు. సంస్కృతీ సంప్రదాయాల నడుమ ఉదయం 11 గంటలకు స్మారక చిహ్నం వద్ద తమ దేవుళ్లకు ప్రతీకలుగా భావించే జెండాలను ఆవిష్కరించారు. సంప్రదాయ వాయిద్యాలైన డప్పు, సన్నాయి, కాలీకోం నినాదంతో ఆ ప్రాంతం మారుమోగింది. అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, ఎంపీ సోయం బాపూరావ్‌, ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొని, భీం విగ్రహం, సమాధి వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు.

- Advertisement -

ఘనంగా సూరు వర్ధంతి..
కుమ్రం సూరు వర్ధంతిని జోడెఘాట్‌లో వైభవంగా నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేసిన సూరు విగ్రహాన్ని మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సూరు మనవడు కుమ్రం పాండుతో పాటు కొలాం సంఘం నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జోడెఘాట్‌ జనసంద్రం
ఉదయం నుంచే గిరిజనులు తరలిరావడంతో జోడెఘాట్‌ జనసంద్రమైంది. కెరమెరి నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ వాహనాల్లో వేలాది మంది సభకు తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆదివాసీ సంప్రదాయ దుస్తులు, బుక్స్‌ స్టాళ్లతో పాటు ఇతర దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. వర్ధంతి సభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గోండి భాషలో పాటలు పాడి సభికులను రంజింప చేశారు. గోండి, కొలాం, ప్రధాన్‌, తోటి, నాయక్‌పోడ్‌, మొత్తం 9 తెగల ఆదివాసులు పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేశారు. వెదురుతో తయారు చేసిన వస్తువుల స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వర్ధంతి సభకు వచ్చిన మహిళలు, పురుషులు, వీఐపీలు, పోలీసులు, మీడియాకు ఎక్కడికక్కడ భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు. మాస్క్‌లు, శానిటైజర్‌తో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆశయాలను నెరవేరుస్తున్నం : మంత్రి ఐకే
ఆదివాసుల హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన కుమ్రం భీం ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జోడెఘాట్‌లో నిర్వహించిన భీం వర్ధంతిలో పాల్గొన్న మంత్రి, అనంతరం ఏర్పాటు చేసిన దర్బార్‌లో ప్రసంగించారు. భీం ఆశయాలైన జల్‌, జంగల్‌, జమీన్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజం చేస్తున్నారన్నారు. జోడెఘాట్‌కు రెండు వరుసల రహదారి నిర్మించినట్లు తెలిపారు. రూ. 25 కోట్లతో జోడెఘాట్‌లో స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియం నిర్మించామని, త్వరలో పర్యాటకుల కోసం కాటేజీలు, హోటళ్లను నిర్మిస్తామని తెలిపారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేబినెట్‌ కమిటీని వేశారని, రెండు మూడు నెలల్లో సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఆదివాసీల ఆశయాలకు అనుగుణంగా భీం వర్ధంతిలో ఏటా తప్పని సరిగా దర్బార్‌ నిర్వహించాలన్నారు. ఆదివాసుల దేవుళ్లన్నీ అడవుల్లోనే ఉన్నాయని, పూజలు, జాతర నిర్వహణకు అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌ రావ్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, ఆసిఫాబాద్‌ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి, డీఎంహెవో కుడ్మెత మనోహర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌, ఎంపీ పీ పెందోర్‌ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, ఉత్సవ కమిటీ చైర్మన్‌ పెందోర్‌ రాము, తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement