
రూ. 90 కోట్లతో మూడేళ్ల క్రితం ఏర్పాటు
శాంతిఖని గని నుంచి తరలినభారీ యంత్రం
బోల్టర్ మైనర్ పైనే ఆశలు
బెల్లంపల్లిటౌన్, ఆగస్టు 20 : మందమర్రి ఏరియా శాంతిఖని గని ఆవరణలో ఉన్న కంటిన్యూయస్ మైనర్ యంత్రం తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. రూ.90 కోట్లతో కంటిన్యూయస్ మైనర్ (సీఎం) భారీ యంత్రాన్ని ప్రవేశపెట్టారు. 2018లో సింగరేణి యాజమాన్యం ఈ యంత్రాన్ని గనిలోనికి దింపింది. బొగ్గు ఉత్పత్తికి నాంది పలికింది. ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో శాంతిఖని గని నుంచి భారీ యంత్రాలైన కంటిన్యూయస్ మైనర్, షటిల్ కార్లు, బోల్టర్, లోడ్ షట్టర్లను తరలించారు. ఈ యంత్రాలను రామగుండం ఏరియాలోని జీడీకే 11 ఇైంక్లెయిన్ గనిలో వీటిని వినియోగించనున్నారు.దీంతో శాంతిఖని గనిలో భారీ యంత్రం కంటిన్యూయస్ మైనర్ శకం ముగిసినట్లయింది.
30 ఏళ్లకు సరిపడా బొగ్గు వనరులు
శాంతిఖని భూగర్భ గనిలో 30 ఏళ్లకు సరిపడా బొగ్గు వనరులు నిక్షిప్తమై ఉన్నాయి. బెల్లంపల్లి రీజియన్‌లోనే శాంతిఖని గని అత్యంత పురాతనమైంది. 1954లో ఈ గని ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరాటకంగా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. ఈ క్రమంలో దీనిని మెగా లాంగ్వాల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దడానికి సింగరేణి యాజమాన్యం ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగానే గనిలో యాంత్రీకరణకు పెద్దపీట వేశారు. మూడేళ్ల క్రితం గనిలో కంటిన్యూయస్ మైనర్ (సీఎం), రెండేళ్ల కితం బోల్టర్ మైనర్ యంత్రాలను ప్రవేశపెట్టారు. ఈ యంత్రాల ద్వారా 13 మిలియన్ టన్నుల బొగ్గును గరిష్టంగా 20 ఏళ్ల దాకా వెలికితీయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ యంత్రం ద్వారా ఏటా మూడు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. గనిలో మెత్తని బొగ్గు పొరలు ఉండడంతో కత్తిరింపు ప్రక్రియ భారంగా మారింది. మూడేళ్ల వ్యవధిలో కేవలం లక్ష టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేశారు. ఈ క్రమంలో కంటిన్యూయస్ మైనర్ యంత్రం పనిచేస్తున్న ప్రాంతంలో బొగ్గు ఉత్పతి చేయడం కష్ట సాధ్యమైంది. భౌగోళిక స్థితుల కారణంగా ఈ యంత్రం ద్వారా ఆశాజనకమైన ఉత్పత్తి జరగకపోవడంతో జూన్ 14న ఉపసంహరించుకున్నారు. ఆ యంత్రం విడి భాగాలు బోల్టర్, ఫ్రీడర్ బ్రేడర్, షటిల్కారులను జీఎంఎస్ కంపెనీ మేనేజర్ శుక్లా సిబ్బందితో కలిసి చేస్తున్న మరమ్మత్తులను ఆయన పరిశీలించారు. మరమ్మత్తులు పూర్తయిన వెంటనే పరికరాలను జీడీకే 11 ఇైంక్లెన్కు తరలించడానికి డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ యంత్రాల విడి భాగాలను గని నుంచి బయటకు తీసుకువచ్చే ప్రక్రియకు రెండు నెలల క్రిం అధికారులు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి ఇక్కడి నుంచి తరలించారు.
బోల్టర్ మైనర్ పైనే ఆశలు
శాంతిఖని భూగర్భగనిలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి యాజమాన్యం బోల్టర్ మైనర్ యంత్రం పైనే ఆశలు పెట్టుకుంది. రెండు సార్లు బొగ్గు ఉత్పత్తి రికార్డును బద్దలు కొట్టడంతో యాజమాన్యం పూర్తిగా ఈ యంత్రంపై దృష్టి కేంద్రీకరించింది. బోల్టర్ మైనర్ యంత్రం ప్రతి నెలలో సగటున 274 మీటర్ల బొగ్గును కత్తిరించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కాగా జూన్‌లో 352 మీటర్ల బొగ్గును కత్తిరించి రికార్డు కెక్కింది. ఈ యంత్రం ద్వారా సింగరేణిలో ఎక్కడా కూడా ఇంత బొగ్గును ఉత్పత్తి చేయకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యంత్రం ద్వారా రోజుకు 100 నుంచి 600 టన్నులు సాధించే దిశగా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. ఈ యంత్రం ద్వారానే బొగ్గు ఉత్పత్తి పెరిగి ఇరవై ఏళ్ల రికార్డును కూడా అధిగమించారు. బొగ్గు ఉత్పత్తి క్రమక్రమంగా పెరుగుతుండడంతో శాంతిఖని భూగర్భ గనికి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కంపెనీకి నష్టమేమి లేదు
ఏరియా శాంతిఖని గని నుంచి కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని తరలించడం ద్వారా సింగరేణి సంస్థకు ఎటువంటి నష్టం లేదు. గని బొగ్గు పొరలు అతి మెత్తగా ఉండడంతో యంత్రంతో బొగ్గును కత్తిరింపు చేయడం కష్టసాధ్యమైంది. దీంతో ఆర్జీ- 2 ఏరియా జీడీకే 11 ఇైంక్లెన్కు తరలించాం. దాదాపు తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఆ గనిలో బొగ్గు పొరలు గట్టిగా ఉండడంతో ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా వెలికితీయవచ్చు. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి సంబంధిత అధికారులు మూడేళ్లు విస్తృతంగా శ్రమించారు. కత్తిరింపు ప్రక్రియ కష్టమైన తరుణంలో చివరి దశలో ఇక్కడి నుంచి తరలించాం. బోల్టర్ మైనర్ ద్వారా గని లక్ష్యాన్ని అధిగమిస్తాం.
చింతల శ్రీనివాస్, మందమర్రి జీఎం