
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఫిల్టర్బెడ్కాలనీలో పర్యటన
ఎదులాపురం, ఆగస్టు 20: మీ ఆరోగ్యం కోసం పరిసరాలను శుభ్రం చేయడానికి వైద్యారోగ్య, మున్సిపల్‌శాఖల ఆధ్వర్యంలో డ్రైడే నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్బెడ్కాలనీలో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దోమల నివారణకు మున్సిపల్, వైద్య సిబ్బంది, చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికీ తిరిగి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎలా వివరిస్తున్నారో కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించిన ప్రాంతాలు, డెంగీ కేసులు వచ్చిన ప్రాం తాల్లో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డు నిల్వలు సక్రమంగా లేకపోడంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోడంతో ప్రజారోగ్య సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారిని అదేశించారు. మురికి కాలువలపై మట్టి నింపిన వారికి జరిమానా విధించాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్‌ను ఆదేశించారు. రెండేళ్లుగా కొవిడ్‌తో ప్రజలు అల్లాడి పోతున్నారని, ప్రస్తుతం సీనిజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. వ్యాధులు ఎలా ప్రబలుతాయో జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ ఓ విద్యార్థికి వివరించారు. కాలనీ పర్యటనలో కలెక్టర్ కారు వద్దకు ఇద్దరు వీధి బాలలు రావడంతో వారితో మాట్లాడారు. ఐసీపీఎస్ అధికారితో మాట్లాడి షెల్టర్‌కు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, కౌన్సిలర్ ఆవుల వెంకన్న, మెప్మా డీఎంసీ సుభాష్, భాగ్యలక్ష్మి, ఆశ వర్కర్లు, మెడికల్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
గ్లౌస్లు,యూనిఫామ్ ధరించాలి
మున్సిపల్ కార్మికులు గ్లౌస్లు, యూనిఫామ్ ధరించి పని చేయాలని కలెక్టర్ సూచించారు. డ్రైడే కార్యక్రమంలో కార్మికులకు గ్లౌస్లు, యూనిఫామ్ లేకపోవడంపై కలెక్టర్ వారిని ప్రశ్నించగా ఇంట్లో పెట్టి వచ్చామని సమాధానం ఇచ్చారు
షోకాజ్ నోటీసులు జారీ
కాలనీలో పర్యటిస్తుండగా ఇంటింటికీ మొక్క లు ఇవ్వలేదా అని కలెక్టర్ ఓ గృహిణిని అడిగారు. ఇవ్వలేదని ఆమె చెప్పడంతో వెంటనే ఇప్పించాలని ఆదేశించారు. పట్టణంలో ప్రతి ఇంటికీ మొక్క లు పంపిణి చేయని సంబంధిత అధికారి, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారిని కలెక్టర్ అదేశించారు . గత నెల నుంచి డ్రైడేను నామమాత్రంగా నిర్వహిస్తుండడంతో వైద్యసిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.