
నా హజ్బెండ్కు ఫోక్ సాంగ్స్ ఇష్టం
అందుకే ‘బుల్లెట్ బండి’ డ్యాన్స్ చేశా
ఇంత రెస్పాన్స్ ఉహించలే..
సోషల్ మీడియా వల్లే ఇంత క్రేజ్
ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లతో ప్రశంసలు
డ్యాన్స్‌తో వైరల్ జంటగా వెలుగులోకి వచ్చిన సాయిశ్రీయ, అశోక్ దంపతుల మనోగతం
రామకృష్ణాపూర్, ఆగస్టు 20 : నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు మని.. పాటపై డ్యాన్స్ చేసిన ఓ దంపతుల వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు రావడంతో ఆ జంట ఆనందంలో మునిగి తేలుతున్నది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన సురేఖ, రాము దంపతుల కూతురు సాయిశ్రీయ వివాహం, రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల నాగన్న, కళావతి దంపతుల కుమారుడు అశోక్‌తో ఈ నెల 14న చేశారు. అనంతరం సాయంత్రం బరాత్‌లో వధువు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జంట శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించింది. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ తన భర్త మనుస్సును గెలుచుకోవడానికి సరదాగా చేసిన డ్యాన్స్‌కు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఉహించలేదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
నెటిజన్ల స్పందన జీవితంలో మర్చిపోలేమని చెప్పుకొచ్చింది. తన భర్తకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టమని తెలుసుకొని, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ మీద డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. ఇదే మా జీవితాల్లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిందని చెప్పారు. కాగా తొలుత తన భర్త స్నేహితులు ఈ విషయం మొదట చెప్పారని, దీంతో కంగారు పడ్డామని తెలిపారు. కాని పాజిటివ్‌గా స్పందన రావడంతో చాలా సంతోషమనిపించిందని చెప్పారు. వరుడు అశోక్ మాట్లాడుతూ బీటెక్ అనంతరం మంచిర్యాల మున్సిపాలిటీ టీపీవోగా తన ఉద్యోగ ప్రస్థానం మొదలైందని చెప్పారు. ప్రస్తుతం కాగజ్‌నగర్, హైదరాబాద్‌లోని బడంగ్పేట్ మున్సిపాలిటీల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. శ్రీమతి డ్యాన్స్ తననెంతో మెప్పించిందని, స్నేహితులు, అధికారులు, బంధువుల నుంచి అభినందనలు వెల్లువెత్తడం ఆనందంగా ఉందన్నారు. ఈ డ్యాన్స్‌కు లక్షల్లో వ్యూస్ వచ్చాయని, ఇతర రాష్ర్టాల నుంచి కూడా తెలిసిన వారు ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అభినందనలు జీవితంలో మర్చిపోమని చెప్పుకొచ్చారు.
-మాట్లాడుతున్న సాయిశ్రీయ,అశోక్