
పీరీలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న ప్రజలు
నృత్యాలు చేసిన యువకులు
ఇంద్రవెల్లి, ఆగస్టు 20: ఏజెన్సీలోని గ్రామాల్లో వారం రోజులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. మండల కేంద్రంలోని ఎస్టీగోండ్గూడ, ప్రధాన్గూడలో ఆదివాసులు పీరీలను ఊరేగించారు. యువకులు నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. పీరీలను ప్రజలు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పీరీల బంగ్లాను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
బోథ్, ఆగస్టు 20: బోథ్, కౌఠ(బీ), ధన్నూర్(బీ), పొచ్చెర, కన్గుట్ట, పార్డీ(కే), సొనాల, కుచులాపూర్ గ్రామాల్లో పీరీలను డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగించారు. ఇళ్ల వద్దకు వచ్చిన పీరీలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. యువకులు అసైదుల్లా హారతి అంటూ కోలాటాలు ప్రదర్శించారు.
ఇచ్చోడ, ఆగస్టు 20: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో పీరీలకు కుడుకలు వేసి దస్తీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పీరీల బంగ్లా వద్ద యువకులు ఆడుతూ సంబురాలు జరుపుకున్నారు.
భీంపూర్, ఆగస్టు 20: మొహర్రం సందర్భంగా కరంజి(టీ)లో పెద్దపులుల వేషధారణతో మొక్కలు చెల్లించుకున్నారు. వర్షం కారణంగా రామాలయ ఫంక్షన్హాల్లో పీరీలకు కవర్లు తొడిగి ఆడించారు. సమీప వాగువద్ద నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జీ స్వాతిక, మొహర్రం కమిటీ ప్రతినిధులు విఠల్, సురేశ్, జీ నరేందర్, ఎల్లి నరేశ్‌రెడ్డి, బీ సతీశ్‌యాదవ్, నిపాని ఆశన్న పాల్గొన్నారు.
సిరికొండ, ఆగస్టు 20: మండల కేంద్రంతో పాటు రాయిగూడ, రాజపేట్, రిమ్మ , లచ్చింపూర్, కొండాపూర్, రాంపూర్ నిజాంగూడ గ్రామాల్లో ప్రజలు పీరీలను పెద్దఎత్తున ఊరేగించారు. గుండాల వద్ద దూలా, దూలా దూలే అంటూ యువకులు నృత్యాలు చేశారు.
బేల, ఆగస్టు 20: మండల కేంద్రంతో పాటు డోప్టాల, శంషాబాద్ , మణియార్‌పూర్, సిర్సన్న, సాంగిడి గ్రామాల్లో మొహర్రం వేడుకలు ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంగ్లావద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీరీలతో పుర వీధులగుండా ఊరేగించారు. యువకులు, మహిళలు వేషధారణలో నృత్యాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.