నిర్మల్ టౌన్, డిసెంబర్ 28 : ఈ సంవత్సరం విద్యా ప్రమాణాల్లో నిర్మల్ పేరు నిలబెట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది విద్య, వైద్య రంగంలో మరింత గుర్తింపును తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అతరొద్దీన్, కార్యదర్శి జావిద్ హుస్సేన్, షబ్బీర్, మతిన్, లాయక్‌అలీ, వాజిద్‌ఖాన్, షబ్బీర్, ఫారూఖ్, ఫేరోజ్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రజతోత్సవాలు
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 28 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న రజతోత్సవాలు బుధవారంతో ముగిశాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం కనుల పండువగా సాగింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి- విజయలక్ష్మి, ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి- వినోదమ్మ, అల్లోల సురేందర్ రెడ్డి, అల్లోల గౌతం రెడ్డి-దివ్యా రెడ్డి, తిరుపతి రెడ్డి దంపతులు, అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
కేరళలోని శబరిమల సన్నిధాన ప్రధాన అర్చకులు పరమేశ్వరన్ నంబూద్రి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరుగగా.. నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారికి పంచామృతాల తో అభిషేకం చేసి మెట్ల పూజను నేత్రపర్వంగా నిర్వహించారు. అయ్యప్ప షరణుఘోష, దీక్షాపరుల నృత్యాలతో దేవాలయ ప్రాంగణం మార్మోగింది. పల్లకీ సేవ, నగర సంకీర్తన నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తి మార్గంతోనే సుఖ సంతోషాలు కలుగుతాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు.