గురువారం 26 నవంబర్ 2020
Adilabad - Oct 20, 2020 , 06:16:21

ఏడాదిలో పట్టణ రూపు రేఖలు మారుస్తాం

ఏడాదిలో పట్టణ రూపు రేఖలు మారుస్తాం

ఆదిలాబాద్‌ రూరల్‌: రూ.20 కోట్లతో అభివృద్ధి పనులను ఏడాదిలోగా పూర్తి చేసి, ఆదిలాబాద్‌ పట్టణం రూపు రేఖలను  మారుస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వినాయక్‌ చౌక్‌లో రూ.10లక్షలతో వీధి వ్యాపారుల కోసం నిర్మిస్తున్న నమూనా దుకాణా సముదాయం, అర్బన్‌ పార్కులో వాచ్‌మెన్‌ గది, రూ.10లక్షలతో మొక్కలకు డ్రిప్‌ ఇరిగేషన్‌, మావలలోని కొవిడ్‌-19తో చనిపోయిన వారికోసం ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక, రూ.6.50లక్షలతో  ఫెన్సింగ్‌  ఏర్పాటు పనులకు భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.20 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రోడ్ల వెడల్పు, డివైడర్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధాన కూడళ్ల సుందరీకరణ,  స్వాగత తోరణం, ప్రధాన వీధుల్లో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు పనులు చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాప్తితో పట్టణ అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఆరోపణలు మానుకొని, అభివృద్ధికి సహకరించాలని సూచించారు. వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అనంతరం దుర్గానగర్‌లోని శ్రీ నవశక్తి దుర్గామాతను దర్శించుకున్నారు. పూజారి కిషన్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.  

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

సీఎం సహాయ నిధి కింద ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ.1.50 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గృహంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అందజేశారు. ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందిన పేదలను సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట కౌన్సిలర్లు రఘుపతి, బండారి సతీశ్‌, శ్రీనివాస్‌, చందా నర్సింగ్‌, భరత్‌, నాయకులు అజయ్‌, లక్ష్మణ్‌, రామ్‌కుమార్‌, దమ్మపాల్‌ , కొండా గణేశ్‌, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు శివకుమార్‌, తదితరులు ఉన్నారు.