మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 29, 2020 , 00:20:29

ఆన్‌లైన్‌లో పశువుల సమగ్ర సమాచారం

ఆన్‌లైన్‌లో పశువుల సమగ్ర సమాచారం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పశువుల ఆరోగ్యాన్ని కాపడుతూ పశుసంపదను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. పుట్టిన మూడు నెలల పశువు మొదలుకొని ఆవులు, గేదెలు, ఎద్దులు మొత్తం 3,60,832 పశువులకు నేషనల్‌ ఎనిమల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం ద్వారా వచ్చే నెల 1 నుంచి 40 రోజులపాటు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. జిల్లాకు 3.59 లక్షల వ్యాక్సినేషన్‌ సరఫరా కానున్నది. ఇందుకు సరిపడా సిబ్బందిని నియమిస్తున్నారు. పశువులకు టీకాలు వేయడంతోపాటు రైతు లేదా పశుపోషకుల వివరాలను సేకరిస్తారు. అనంతరం పశువు చెవికి 12 అంకెల ట్యాగ్‌ను వేయనున్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో క్రోడీకరించనున్నారు. 

ఆన్‌లైన్‌లో పశువుల సమాచారం..

ఆవులు, గేదెలు, ఎద్దులకు ఫిబ్రవరి ఒకటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నారు. గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో 3,60,832 ఆవులు, గేదెలు, ఎద్దులు ఉన్నాయి. ఇందుకు 3.59 లక్షల డోసుల వ్యాక్సిన్‌ అవసరముందని పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలో వ్యాక్సినేషన్‌ వేయనుండగా.. యంత్రాంగం సిద్ధమవుతున్నది. మంగళవారం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేశ్‌ జిల్లాలోని పశువైద్యాధికారులతో సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్‌పై శిక్షణ ఇచ్చారు. 18 మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పశువులకు వ్యాక్సిన్‌ వేయనున్నారు. రైతు, పశుపోషకుల వివరాలతోపాటు పశువుల వివరాలను అడిగి తెలుసుకొని ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేస్తారు. ఆ తర్వాత పశువుల చేవికి 12 అంకెల ట్యాగ్‌ను వేస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో ఈ వివరాలను క్రోడీకరిస్తారు. పశువుల చెవికి వేసిన ట్యాగ్‌పై బార్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆ పశువు యజమాని పేరు, సమయాను సారంగా వ్యాక్సిన్‌ వేశారా లేదా వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రత్యేక సిబ్బంది నియామకం..

నేషనల్‌ ఎనిమల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ సన్నద్ధమవుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పశు వైద్యాధికారులకు డీడీ సురేశ్‌ మార్గదర్శకాలను జారీ చేశారు. పశు పోషకులు, రైతులు, ఆవులు, గేదెలు, ఎద్దుల వివరాల నమోదుకు నమూనా ప్రొఫార్మాను అందజేశారు. మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభంకానుండగా, అధికారులు సిద్ధం కావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పశు వైద్యాధికారులు 110 మంది ఉండగా గోపాల మిత్ర, పశుమిత్ర, ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవాలని తీసుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులకు వ్యాక్సినేషన్‌ ఎలా చేయాలనేదానిపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. వీరికి పశువుకు రెండు రూపాయల చొప్పున చెల్లించనున్నారు. ఆసక్తి ఉన్న వారు మండల పశువైద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. రోజు వారీగా వేసిన వ్యాక్సినేషన్‌, పశువుల వివరాలు, రైతు, పశుపోషకుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. 


logo
>>>>>>