హరితహారాన్ని సవాల్‌గా తీసుకున్న తాడిహత్నూర్
పలు గ్రామాలకు ఆదర్శం
నార్నూర్, నవంబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని కొన్ని గ్రామాలు తూతూ మంత్రంగా పాటిస్తే.. మరికొన్ని గ్రామాలు ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. అధికారుల చొరవతో మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత ఆయా గ్రామాల ప్రజలు చేపట్టారు. దీంతో ఎన్నో గ్రామాలు పచ్చదనంతో నిండాయి. తాడిహత్నూర్ గ్రామం ఆకుపచ్చ రంగును అద్దుకొని హరితహారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తాడిహత్నూర్‌లో 1100 కుటుంబాలు ఉండగా 3,222 జనాభా ఉంది. గ్రామానికి వెళ్లే రహదారికిరువైపులా చూస్తే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఆకట్టుకుంటాయి. కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే చర్యల్లో భాగంగా ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. మొక్కలు ఎండిపోకుండా ట్రాక్టర్ ద్వారా నీటిని పోస్తారు. మొక్కల మధ్యలో ఏర్పడిన కలుపుగడ్డిని పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. దీంతో ఈ మొక్కలు గ్రామంలోకి వచ్చే వారికి ఆకు పచ్చతోరణంలాగా స్వాగతం పలుకుతూ..చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
పచ్చని వాతావరణం ప్రతి ఇంటి సొంతం
హరితహారం కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి వీధి, ఇంటి ముందు మొక్కలు నాటారు. గ్రామంలో 11 కుటుంబాలు 3400 మొక్కలు నాటారు. ఇంటి ముందు నాటిన మొక్కలు ఆ ఇంటి యజమానులే సంరక్షించుకునే విధంగా, రోడ్డుపై ఉన్న మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది సంరక్షిస్తుండడంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. గ్రామం పచ్చదనంతో వెల్లివిరుస్తోన్నది. ఎంతో మంది చెట్ల కింద సేదతీరుతుంటారు.
కంటికి రెప్పలా కాపాడుతున్నం..
గ్రామంలో నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుతున్నం. మొక్కలకు కావాల్సిన నీరు సరైన సమయంలో అందించాం. వేసవిలో సైతం మొక్కలు ఎండిపోకుండా ప్రత్యేకంగా నీరు అందిస్తాం. మొక్కల మధ్య చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. గ్రామంలోని పచ్చదనం గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటారు. చాలా సంతోషంగా ఉంది.
రాథోడ్ మధుకర్, సర్పంచ్, తాడిహత్నూర్
ప్రశాంతంగా ఉంటుంది..
గ్రామంలోకి వచ్చే వారికి పచ్చదనంతో స్వాగతం పలికే విధంగా రోడ్డుకిరువైపులా చెట్లు ఎంతో బాగుంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకుంటున్నారు. గ్రామస్తులంతా ఎవరికి వారే చైతన్యం పొంది పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పుడు మా గ్రామం ఓ పార్కును తలపించేలా ఉంది.