
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఎడతెరిపిలేని వాన
పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు..
పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు..
ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువనకు నీటి విడుదల
ఆదిలాబాద్, ఆగస్టు 19 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. పెంబిలో వాగులు ఉప్పొంగగా.. ఇద్దరు చిక్కుకోవడంతో స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరారు. గుడిహత్నూర్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదులుతున్నారు. నేరడిగొండలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కుంటాల, పొచ్చెర, కనకాయ, ఫారేఖాతి జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గు రువారం ఉదయం 10 గంటల వరకు కురిసిన వర్షంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. జిల్లాలో వానకాలం సీజన్ ప్రారంభం నుంచి కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, ఇతర నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 76.7 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో సాధారణ కంటే ఎక్కువ వర్షం పడిం ది. తలమడుగు మండలంలో అత్యధికంగా 128 మిల్లీ మీటర్లు, జైనథ్లో అత్యల్పంగా 49.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత..
ఎగువ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నది. సాత్నాల ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 285.65 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తిన అధికారులు నీటిని బయటకు వదులుతున్నారు. మత్తడి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 277 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుల నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు 23,000 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. కడెం జలాశయానికి వరద వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్ర స్తుతం 696.450 అడుగులుగా (6.708టీఎంసీల) ఉంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 57498 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు ఐదు వరదగేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 51945 నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 12 క్యూసెక్కులు, ప్రధాన కాలువకు 475 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జలపాతాల పరవళ్లు..
కుంటాల, పొచ్చర, కొరిటికల్, కనకాయి జలపాతాల్లోకి భారీగా వరద వస్తున్నది. దీంతో జలకళను సంతరించుకున్నాయి. వర్షం నీటి కారణంగా చెరువులు మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి. నా ర్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామీ సమీపంలోని అటవీ ప్రాంతంలో పారేఖాతి జలపాతం కనువిందు చేస్తున్నది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జారువారులుతున్న అందాలు మైమరిపిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో కడెం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. తులసీపేట నుంచి పలువురు వాగు దాటుతుండగా ఒక్కసారి ప్రవాహం పెరగడంతో ఇద్దరు వ్యక్తులు కొన్ని గంటల పాటు కడెం వాగు మధ్యలో ఉండిపోయారు. వరద ప్రవాహం తగ్గాక స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. ఇచ్చోడ మం డలం ముక్రా(కే) వాగు పొంగి ప్రవహించింది. ఆయా కాలనీల్లో వర్షపునీరు చేరడంతో చెరువులను తలపించాయి. గుడిహత్నూర్ మండలంలో ని మన్నూర్ గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగడంతో ఇళ్లలోకి, పంటచేనుల్లోకి వరద చేరింది. నేరడిగొండ మండలం రాజులతండా, సేవాదాస్నగర్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తు లు బయటకు వెళ్లేందు కు వేరే మార్గం లేకపో గా.. వరదలో నుంచి వాగు దాటారు. సేవాదాస్నగర్లో కూడా గ్రామస్తు లు ఎడ్లబండి సహాయంతో వాగుదాటారు. బజార్హత్నూర్ మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలు లోతట్టు ప్రాం తాల్లోకి వరద వచ్చి చేరడంతో పాటు పలు ఇళ్లు వర్షానికి కూలిపోయాయి. చేతికొస్తున్న పంటలు నీట మునిగాయి.