కల్వర్టును ఢీకొన్న ఆటో..
నలుగురు దుర్మరణం..
మరో ఇద్దరికి తీవ్రగాయాలు..
నిర్మల్ జిల్లా కడెం మండలంలో ప్రమాదం
కడెం, జనవరి 19 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్ద బెల్లాల్-చిన్న బెల్లాల్ గ్రామాల మధ్య బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆటో కల్వర్టును ఢీ కొట్టడం తో కాలువలో పడి నలుగురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ ఎండీ సాదేర్ కడెం నుంచి పెద్ద బెల్లాల్-చిన్న బెల్లాల్ మీదుగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామానికి ప్రయాణికులను తీసుకొని బయలుదేరాడు. లింగాపూర్ పంచాయతీ పరిధిలోని మల్లన్నపేటకు చెందిన కొండ మల్ల య్య, కన్నాపూర్ పంచాయతీ పరిధిలోని చిన్న క్యాంపునకు చెందిన కొండ శంకరయ్య, పెద్దబెల్లాల్‌కు చెందిన సీమల శాంత, దస్తూరాబాద్ మండలంలోని గొడిసేర్యాలకు చెందిన శ్రీరాముల లక్ష్మి, డ్రైవర్ స్నేహితుడు పెద్దబెల్లాల్‌కు చెందిన ఎండీ జహీరొద్దీన్ ఆటోలో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్, అతని స్నేహితుడు ‘నేను ఆ టో నడుపుతా అంటే నేను నడుపుతా..’ అం టూ ఇద్దరు స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఆటోను వేగంగా, అజాగ్రత్తగా నడుపడంతో పెద్ద బెల్లాల-చిన్న బెల్లాల గ్రామాల మధ్య గల పాత చెరువు మూలమలుపు వద్ద ఉన్న కల్వర్టుకు ఢీ కొట్టడంతో ఆటో కాలువలో పడిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న కొండ మ ల్లయ్య(60), కోండ్ర శంకరవ్వ(55), సీమల శాంత(45) అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీ రాముల లక్ష్మి (57)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, వాహనదారులు 108కు సమాచా రం అందించారు. క్షతగాత్రులను కడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో నిర్మల్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటలకు మృతిచెందింది. వాహనం నడుపుతున్న డ్రైవర్, అతని స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు సాదేర్ను, నిర్మల్ ప్రభుత్వ దవాఖానకు జహీరొద్దీన్ తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ప్రమాదస్థలాన్ని ఖానాపూర్ సీఐ అజయ్‌బాబు, కడెం ఎస్ఐ కోసాని రాజు పరిశీలించారు. పంచానామా నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు మృతదేహాలను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన సాదేర్ కుటుంబ సభ్యులు పరారీలో ఉండగా.. జహీరొద్దీన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అన్నీ తానై..
కడెం మండలం పెద్దబెల్లాల్‌కు చెందిన సీ మల శాంతకు నలుగురు కూతుళ్లు. భర్త ఏసు వీఆర్వోగా పనిచేస్తూ మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో నాలుగేండ్ల క్రితం సస్పెండ్ అ య్యాడు. అర ఎకరంలో ఎవుసం చేస్తూ, కూలీ పనులకు వెళ్తూ శాంత కుటుంబాన్ని పోషిస్తున్నది. పెద్ద కూతురు ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తుండగా.. రెండో, మూడో కూతుళ్లు స్థానికం గా చదువుకుంటున్నారు. చిన్న బిడ్డను మద్దిపడగలో ఉంటున్న తన అక్కకు దత్తత ఇచ్చింది. మూడు రోజుల క్రితం ముగ్గురు బిడ్డలు బోర్నపల్లిలో ఉంటున్న మేనత్త వద్దకు వెళ్లారు. వారి ని తీసుకువచ్చేందుకు వెళ్తున్న క్రమంలో ప్ర మాదం సంభవించింది. శాంత చనిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. అన్నీ తానై చూసుకుంటున్న తల్లి లేకపోవడంతో పిల్లల రోదనలు పలువురిని కలిచివేశాయి.
పరామర్శించేందుకు వెళ్తూ..
కడెం మండలంలోని మల్లన్నపేటకు చెందిన కొండ మల్లయ్య చిన్న బెల్లాల్ గ్రామానికి వెళ్తున్నాడు. గిరివేణి శంకర్ 15 రోజుల క్రితం మందు తాగి చనిపోవడంతో పరామర్శించేందుకు వెళ్తున్నాడు. మల్లయ్యకు భార్య నర్సవ్వ, కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెండ్లి అయ్యింది. భార్యతో కలిసి ఎవుసం చేస్తూ.. గొర్లు కాస్తూ జీవిస్తున్నాడు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు.
బంధువుల ఇంటికి..
కడెం మండలంలోని చిన్న క్యాంపు గ్రామానికి చెందిన కోండ్ర శంకరవ్వ భర్త పదేండ్ల క్రి తం చనిపోయాడు. తల్లి నర్సవ్వ వద్దనే ఉంటున్నది. శంకరవ్వ మతిమరుపు, మతిస్థిమితం లేకపోవడంతో తల్లే సాకుతున్నది. పిల్లలు లే రు. పెద్దబెల్లాల్ పంచాయతీలోని ఎస్సీ కాలనీ లో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. కూతురు చనిపోవడంతో నర్సవ్వ దిక్కలేనిది అయింది.
కొడుకు ఇంటికి వెళ్తూ..
దస్తూరాబాద్ మండలంలోని గొడిసేర్యాల గ్రామానికి చెందిన శ్రీరాములు లక్ష్మికి ఇద్దరు కొడుకులు, బిడ్డ. భర్త కొన్నేండ్ల క్రితం మృతిచెందాడు. అందరికీ పెండ్లి అయ్యింది. చిన్న కొడుకు, బిడ్డ స్థానికంగానే ఉంటుండగా.. పెద్ద కొడుకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపల్లిలో ఉంటున్నాడు. కొడుకు ఇంటికి వెళ్తుండగా, ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది.