ఎదులాపురం, సెప్టెంబర్ 27 : రికవరీ చేసిన ప్రజల డబ్బును సొసైటీకి ఇవ్వకుండా వాడుకున్న ఆర్డీసీసీ ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన రాగం రమేశ్, అదే గ్రామానికి చెందిన కొండూరి రాకేందర్ ఆర్డీసీసీ ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా నియామకం అయ్యారు. రమేశ్, రాకేందర్లు వరుసగా భీంపూర్, తలమడుగు, తాంసి, గాదిగూడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, జైనూర్, నార్నూర్, ఇచ్చోడ, బజార్హత్నూర్, సిరికొండ, ఉట్నూర్ మండలాల్లో విధులు నిర్వర్తించారు.
రమేశ్ 2022 నవంబర్ నుంచి 2023 మార్చి మధ్య 60 మంది రైతుల నుంచి వసూలు చేసిన రూ.4 లక్షలను సొసైటీకి చెల్లించకుండా వాడుకున్నాడు. అలాగే రాకేందర్ కూడా రైతుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసి, అదనంగా సొసైటీ నుంచి రూ.4.50 లక్షల చేతి రుణం తీసుకొని మొత్తం రూ.8.50 లక్షలను అక్రమంగా వినియోగించుకున్నాడు. తర్వాత సొసైటీ అధికారులు రైతులను కలిసినప్పుడు వారు తమ రుణాలు అభివృద్ధి అధికారులకే చెల్లించామని తెలిపారు.
ఈ విషయంపై విచారణ చేపట్టగా.. రమేశ్, రాకేందర్లు రాత పూర్వకంగా డబ్బు వాడుకున్నామని అంగీకరించారు. సొసైటీకి తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ మేరకు ఆర్డీసీసీ సొసైటీ మేనేజర్ బేలే రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, సొసైటీకి మోసం చేసిన ఇద్దరు అభివృద్ధి అధికారులపై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.