నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 7 : కొవిడ్ కారణం గా సుమారు ఏడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు ఈనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సందడిగా మారాయి. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు చదువులు దూరం కావద్దన్న ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులను నడిపింది. దీంతో అనేక మంది ఆన్లైన్ పాఠాలు విన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి మెగ్గు చూపుతున్నారు. ఆన్లైన్ తరగతులతో విద్యార్థులకు కొంత ఇబ్బంది కలుగడంతో ప్రత్యక్ష తరగతులకే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా పెరుగుతున్నది. పాఠశాలలు ప్రారంభించే వారం రోజుల ముందుగానే ప్రత్యక్ష తరగతులు బోధించేందుకు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించడంతో విద్యాశాఖ అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. 18 నెలల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో పాఠశాల గదులతో పాటు పరిసరాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం, మరుగుదొడ్లు, వ్యాటర్ ట్యాంకులను శుభ్రం చేసి తరగతి గదులను శానిటైజేషన్ చేశారు. దీంతో విద్యార్థులు పాఠశాలలకు పరుగులు తీస్తున్నారు.
సర్కారు స్కూళ్లలో కొవిడ్ రూల్స్
ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, సిబ్బంది కచ్చితంగా మాస్కు ధరించి వస్తేనే పాఠశాలల్లోకి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. పాఠశాలల స్థితిగతులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా విద్యాధికారి టామ్నె ప్రణిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పెరుగుతున్న హాజరు శాతం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతున్నది. నిర్మల్ జిల్లాలో మొత్తం 862 పాఠశాలలు ఉండగా ఇందులో ఉన్నత పాఠశాలలు 162, ప్రాథమికోన్నత పాఠశాలలు 102, ప్రాథమిక పాఠశాలలు 598 పాఠశాలలు ఉన్నాయి.వీటిలో సుమారుగా 54,875 మంది చదువుకుంటున్నారు. 205 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో మొత్తం 62,617 మంది విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో రోజు రోజుకూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతన్నది. తొలి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 31.70 శాతం హాజరు నమోదుకాగా.. రెండో రోజు 46.82, మూడో రోజు 53.67, నాలుగో రోజు 53.46, ఐదో రోజు పొలాల అమవాస్య సందర్బంగా పండుగ నేపథ్యంలో 39.00 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. రానున్న రోజుల్లో హాజరు శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఫీజుల మోత..
18 నెలలుగా మూత పడడంతో ప్రైవేట్ పాఠశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజుల వసూలుకు ఇదే అదునుగా దొరకడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గతేడాది ఫీజులతో పాటు పెండింగ్ ఫీజుల వసూలుపై దృష్టి సారించాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో హాజరయ్యేందుకు విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రైవేట్‌కు పంపించేందుకు మొగ్గు చూపడం లేదు. దీనికి తోడు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘిస్తారనే నేపథ్యంలో తల్లిదండ్రులు సర్కారు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలలో సగానికి తక్కువ మంది తరగతులకు హాజరవుతున్నారు.
నిబంధనలు పాటించేలా చూడాలి
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించేలా చూడాలి.
ప్రణీత, డీఈవో, నిర్మల్